Breaking News

పేదల సొంతింటి కలను అడ్డుకుంటున్న చంద్రబాబు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సొంతింటి కల సాకారం దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గాంధీ నగర్ పరిధి సీఎస్ఆర్ రోడ్డు, స్విమ్మింగ్ పూల్ స్ట్రీట్, స్వామి స్ట్రీట్, మాజేటి వారి వీధి, సుందరమ్మ వీధి, భరద్వాజ వీధి, పాసల వారి వీధి, జ్ఞానోలి వారి వీధి, ఉయ్యూరి జమీందార్ వీధి, ఎన్ఆర్పి రోడ్డు ప్రాంతాలలో పర్యటించిన ప్రజాప్రతినిధులకు స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బాలి గోవింద్, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దాదాపు 750 ఇళ్లను సందర్శించారు. తొలుత సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ లో వీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రతి గడపకి వెళ్లి మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ, జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు తమ జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని ఈ సందర్భంగా ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు.

193 వ సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 1.78 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 221 మందికి ప్రతినెలా రూ. 5.60 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 228 మందికి రూ. 31.92 లక్షలు., విద్యాదీవెన ద్వారా 48 మందికి రూ. 7.27 లక్షలు., చేయూత ద్వారా 121 మందికి రూ. 22.68 లక్షలు., వాహనమిత్ర ద్వారా 7 మందికి రూ. 70 వేలు., కాపు నేస్తం ద్వారా 7 మందికి రూ. 1.05 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 14 మందికి రూ.2.10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. అలాగే 36వ డివిజన్ లో అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు రూ. 6.39 కోట్ల పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో రూ. 2.21 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 1.81 కోట్ల పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మరో రూ. 2.35 కోట్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల తన పాలనలో మేనిఫెస్టోలోని ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని విమర్శించారు. కనుకనే మూడేళ్ల పాలనలో తాము అమలు చేసిన పథకాలను గడప గడపకు మన కార్యక్రమం ద్వారా వివరిస్తుంటే జీర్ణించుకోలేక బురద చల్లుతున్నారన్నారు. దాదాపు 10 వేల మంది పేదలకు సీఆర్డీఏ పరిధిలో ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కేటాయిస్తే తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుల ద్వారా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఫలితంగా వేలాది మంది పేదలు సొంతిళ్లకు దూరమయ్యారని నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. పేదలందరికీ న్యాయం చేసేలా నగర సమీపంలో స్థలాలు కొని ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు పేదల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాలుగైదు నెలల్లో వీరందరికీ ఇళ్ల పట్టాలు కేటాయిస్తామని తెలియజేశారు. మరోవైపు ఎవరితో పొత్తులో వెళతారో కూడా స్పష్టత లేని సీపీఐ నాయకులు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకి అద్దె మైకులా మారిన సీపీఐ నారాయణకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గూర్చి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న దిగజారుడు రాజకీయాలను కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని ఒంటరిగా ఢీకొనే సత్తా లేక.. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని వారు ప్రకటించుకోవడం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఎవరు, ఎవరితో, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌ సీపీని ఓడించలేరని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మరోసారి స్పష్టం చేశారు.

డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డి మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. కనుకనే నియోజకవర్గంలో ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని గుర్తుచేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి పెద్దఎత్తున అపూర్వ స్పందన లభిస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఏఈలు వెంకటేష్, రామకృష్ణ, నాయకులు పులపా కృష్ణ, జొన్నలగడ్డ ఆర్.కె., ఆత్మకూరు సురేష్, రాంబాబు, తాటి శివ, పురిటి శివ, ఇప్పిలి శ్రీను, నర్సి, గుప్తా, కొల్లూరు రామకృష్ణ, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *