నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, పోలింగ్‌కు ముందు 48గంటల సమయంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూ.చా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ వీసీ హాలులో ఆత్మకూరు ఉప ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు,రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు, స్వీప్, వృద్ధులు, దివ్యంగ ఓటర్ల యాప్ వినియోగం, సి విజిల్ నిర్వహణ, రవాణా, ఈవీఎంల శిక్షణ, నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, రవాణా సౌకర్యాలు, ఎంసిఎంసి, ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, అకౌంటింగ్ టీమ్‌ల నియామకం, సింగిల్ విండో యాప్, పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, జిల్లా ఎస్పీ విజయరావు శాంతిభద్రతల పర్యవేక్షణకు చేపట్టిన బందోబస్తు చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఈవోకు వివరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ అన్ని పోలింగ్ స్టేషన్లలో విద్యుత్, తాగునీరు, వికలాంగులకు ర్యాంపులు, వీల్ చైర్స్ ఇతర మౌలిక వసతులను పూర్తిస్థాయిలో ఉండేలా నోడల్ అధికారులు మరొకసారి పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఈవీఎంలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో సరి చూసుకోవాలని, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే తక్షణమే స్పందించి పోలింగ్ మొదలైన ఒక గంటలోపు పరిష్కరించుకోవాలని, ఓటరు జాబితాలో పేర్లు లేని సందర్భంలో ఓటర్లకు సమస్యను సున్నితంగా వివరించాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆబ్సెంట్ ఓటర్ల ఓట్లు వేసే వారిని గుర్తించాలని, ఇందుకోసం ఆబ్సెంట్, వలస, మృతి చెందిన ఓటర్ల జాబితా బహిరంగంగా ప్రదర్శించడంతో పాటు ఏజెంట్లకు చేయాలన్నారు. ఈవీఎంల రవాణా పక్కదారి పట్టకుండా నిర్ణీత ప్రదేశాలకు చేర్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగుకు 48 గంటల ముందు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, అడిషనల్ ఎస్పీ హిమవతి, సెబ్ జెడి లక్ష్మి, డిఆర్‌ఓ వెంకట నారాయణమ్మ, నోడల్ అధికారులు షణ్ముఖ కుమార్, యం.పెంచలయ్య, ధనలక్ష్మి, తిరుపాల్‌రెడ్డి, చందర్, సురేష్ కుమార్, రమేష్, రాజశేఖర్, వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News