-మీట్ ద ప్రెస్‌లో రాజ్యసభ సీపీఐ పక్షనేత వినయ్ విశ్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏనాడూ మహిళలకు ఆర్ఎస్ఎస్లో ప్రాతినిధ్యం కల్పించని ఆ సంస్థ కనుసన్నల్లో నడుస్తున్న మోదీ ప్రభుత్వం గిరిజన రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడం మొసలి కన్నీరు కార్చడమేనని రాజ్యసభ సీపీఐ పక్ష నేత వినయ్ విశ్వం విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన బుధవారం ఉదయం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తూ, మహిళా సాధికారత గురించి మాట్లాడటం అర్థంలేనిదన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి, గిరిజనులకేదో మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ఒకప్రక్క గిరిజన హక్కులను కాలరాస్తూ, మరోప్రక్క గిరిజనులపై సవతి తల్లి ప్రేమ నటించడం బీజేపీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. నీరు, భూమి, అడవి (జల్, జమీన్, జంగిల్) కోసం గిరిజనులు సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్నప్పటికీ వారి సమస్యలను, సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 17 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మాజీ మంత్రి ఐఏఎస్ అధికారి యశ్వంత్ సిన్హాను నిలపాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతకు ఇదొక భూమిక కానుందన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా తయారైందన్నారు. ఈ ప్రభావం అన్ని రాష్ట్రాలపై పడిరదన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, ఆనాటి హిట్లర్ ప్రభుత్వ పాలనకు సారూప్యత ఉందని విమర్శించారు. అగ్నిపథం పథకంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ పథకపై కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖలో సవివరమైన చర్చలు జరపకుండా ఏకపక్షంగా అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. గతంలో కూడా మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలపై అవి సరైనవేనని సమర్థించుకోగా, ప్రజలు తప్పు అని చెప్పారని, ఆచరణలో కూడా అదే రుజువైందన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ మోదీ క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షులు చావా రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి ఆర్.వసంత్ పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులు వినయ్ విశ్వంను ప్రెస్‌క్లబ్ నిర్వాహకులు దుశ్వాలువా, మెమెంటోతో సత్కరించారు.
Prajavartha Online Telugu News