
-డాక్టర్స్ డే సందర్భంగా ఎకనమిక్స్ టైమ్స్ లెజెండ్స్ ఇన్ ఇండియా అవార్డు ప్రదానం
-డాక్టర్ సదాశివరావు సేవలకు పలువురి ప్రశంసలు
-కేంద్ర మంత్రి అనుప్రియా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న డాక్టర్ సదాశివరావు
-అవార్డు స్ఫూర్తితో సేవలను మరింత విస్తరిస్తాం: డాక్టర్ వై. సదాశివరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ యలమంచి సదాశివరావుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లెజెండ్స్ ఇన్ ఇండియా అవార్డు లభించింది. డాక్టర్స్ డే సందర్భంగా ఢిల్లీలో ఎకనమిక్స్ టైమ్స్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సదాశివరావుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ద్వారా మూడున్నర దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ సదాశివరావు డయాబెటాలజీ విభాగంలో ఎకనమిక్స్ టైమ్స్ లెజెండ్స్ ఇన్ ఇండియా పురస్కారం లభించింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి అనుప్రియా పాటిల్ చేతుల మీదుగా డాక్టర్ సదాశివరావు అవార్డును అందుకున్నారు. పూర్వ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తదితర ప్రముఖులు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, డాక్టర్ యలమంచి సదాశివరావు సేవలను ప్రశంసించారు. ఈటీ లెజెండ్స్ ఇన్ ఇండియా అవార్డును అందుకున్న నేపథ్యంలో నగరంలోని మనార్ ఫుడ్ ప్లాజాలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ వై. సదాశివరావు మాట్లాడుతూ ఎకనమిక్స్ టైమ్స్ లెజెండ్స్ ఇన్ ఇండియా అవార్డును అందుకోవడం సంతోషాదయకమని అన్నారు. మధుమేహవ్యాధి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు, అత్యాధునిక మధుమేహ వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహవ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామని గుర్తుచేశారు. మధుమేహ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు నాణ్యమైన చికిత్సలను అందిస్తున్నట్లు వివరించారు. ఎకనమిక్స్ టైమ్స్ అందించిన లెజెండ్స్ ఇన్ ఇండియా పురస్కారం అందుకున్న స్ఫూర్తితో సేవలను మరింత విస్తరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో యలమంచి డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ యలమంచి హిమన, డాక్టర్ ఐశ్వర్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News