– లబ్ధిదారులకు కేంద్ర మంత్రి సోమ్ పర్కాష్ సూచన
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని.. సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ పర్కాష్ లబ్ధిదారులకు సూచించారు. కేంద్ర మంత్రి పర్కాష్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. అదే విధంగా పరిశ్రమలు, హౌసింగ్, వ్యవసాయం, పౌర సరఫరాలు; మహిళ, శిశు సంక్షేమం; వైద్య, ఆరోగ్యం; గ్రామీణ నీటి సరఫరా తదితర విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్), ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జీఎం-జీకేఏవై, పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాల లబ్ధిదారులతో ముచ్చటించి సదరు పథకాల ద్వారా కలిగిన ప్రయోజనం, జీవితాల్లో వచ్చిన అభివృద్ధిని తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను మంత్రికి తెలియజేయగా, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు గణాంకాలతో సహా వాటి ప్రగతిని వివరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల లబ్ధిదారులు పథకాల ద్వారా పొందిన ప్రయోజనాలను వివరించారు. తొలుత ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) అమలుతీరును జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం టి.మురళి వివరించారు. ఈ పథకం కింద జిల్లాలో 2020-21లో 75, 2021-22లో 78 యూనిట్లతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11 యూనిట్లు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు రుణాలు పొంది.. తమతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్న తీరును వివరించారు. అదే విధంగా కాకినాడ, గాంధీనగర్‌కు చెందిన పీఎంఈజీపీ లబ్ధిదారు మాట్లాడుతూ తనకు చిన్నప్పటినుంచి పారిశ్రామికవేత్త కావాలనే కోరిక ఉండేదని.. పీఎంఈజీపీ పథకం ద్వారా ఇప్పుడది నెరవేరిందన్నారు. పరిశ్రమల శాఖ అధికారులు చక్కటి ప్రోత్సాహం అందించడంతో బ్యాంకు ద్వారా రూ.25 లక్షల రుణంతో పాటు ఏపీఐఐసీ ద్వారా స్థలం పొంది ఫాల్ జీ బ్రిక్స్ యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వ్యాపారం ద్వారా 20 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణంపై జరిగిన సమీక్షలో జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద అర్బన్ ఆవాసాల్లో 2016-17 నుంచి ఇప్పటి వరకు 83,324 ఇళ్లు మంజూరు అయ్యాయని, 77 శాతం మేర గ్రౌండింగ్ జరిగినట్లు హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్ తెలియజేశారు. జిల్లాలో దాదాపు మూడు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను సేకరించి, అన్ని సౌకర్యాలతో పెద్దపెద్ద లేఅవుట్లుగా అభివృద్ది చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరుచేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా మంత్రికి వివరించారు. కాకినాడ రూరల్, తిమ్మాపురానికి చెందిన ఆది ఝాన్సీ పీఎంఏవై పథకం కింద నిర్మించుకున్న ఇంటిలో తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటోందని.. గతంలో వేలకు వేలు అద్దెలుగా చెల్లించి, కష్టాలు పడేవారమని ఇప్పుడు సొంతిటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తూ తమ ఇళ్ల ఫోటోలను మంత్రికి చూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 2018, డిసెంబర్ 1న ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం జనవరి, మే, అక్టోబర్‌లో రూ. 2 వేలు చొప్పున ఏటా అందిస్తున్న రూ. 6 వేల
ఆర్థిక సహాయంతో వడ్డీ వ్యాపారుల బారి నుండి బయటపడినట్లు పెదపూడికి చెందిన రైతు వీర్రాజు మంత్రికి వివరించారు. కట్టెలు, కిరోసిన్ పొయ్యిలపై వండుతూ పొగబారిన తమ జీవితాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రూ. 1,600 ఆర్థిక సహాయంతో పొందిన ఎల్‌పీజీ కనెక్షన్ తమ రోజువారీ జీవితంలో వెలుగు నింపిందని, అదే విధంగా కోవిడ్ సమయంలో గరీబ్ కళ్యాణ్ అన్నయోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం, కందిపప్పుతో పేద కుటుంబాలకు ఆహార భద్రత లభించిందని లబ్ధిదారులు వివరించారు. ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ మిషన్, ముద్రా యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు తమ రోజువారీ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందీ ఉదాహరణలతో సహా లబ్ధిదారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోమ్ పర్కాష్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అమలుచేయడంలో కృషిచేస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పథకాల ద్వారా ప్రయోజనం పొంది, తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్న లబ్ధిదారులు వ్యక్తంచేసిన ఆనందాన్ని, కృతజ్ఞతలను గౌరవ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
అనంతరం కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులతో కలిసి 6,577 మంది వీధి విక్రయదారులకు పీఎం స్వానిధి ద్వారా రూ. 8.34 కోట్ల రుణ సహకారానికి సంబంధించిన మెగా చెక్‌ను కేంద్ర మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
సమావేశంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, పరిశ్రమల శాఖ జీఎం టి.మురళి, ఎల్‌డీఎం ఎస్.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, డీఎంహెచ్‌వో డా. ఎ.హనుమంతరావు, పీడీ హౌసింగ్ బి.సుధాకర్ పట్నాయక్, సీపీవో పి.త్రినాథ్, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News