-గిరిపురంలో ఎమ్మెల్యే చేతులమీదుగా వైఎస్ఆర్, అంబేద్కర్, బాబూ జగ్జీవన్ విగ్రహాల ఆవిష్కరణ
-మేరునగ ధీరుడు వై.ఎస్.ఆర్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని.. ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు. గిరిపురం రెడ్ సర్కిల్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పలువురు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ఆ విగ్రహాలను చూసినప్పుడల్లా.. ఆ మహాత్ముల ఆశయాల సాధన కోసం కృషి చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, తన జీవితంపై వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులు ఎందరో ఉంటారని.. కానీ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే అని కీర్తించారు. ఆయన జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, పెన్షనర్ల సాధక బాదకాలు గుర్తించి వారి కష్టాలను తీర్చిన ప్రజానేత అని పేర్కొన్నారు. మాట తప్పని మడమతిప్పని ఆయన నైజం పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఈసడించినా.. దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన నాయకులు వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. జలయజ్ఞం ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పోలవరం, పులిచింతల, డెల్టా ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన చేసిన కృషి వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు 108 సేవలను ప్రారంభించి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని మల్లాది విష్ణు అన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు సహా 942 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందేలా చేశారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 సార్లు అధికారిక పర్యటనలు చేసిన ఘనత ఒక్క వైఎస్ కే దక్కుతుందన్నారు. పేదలకు JNNURM ఇళ్లు, నూజివీడులో ట్రిపుల్ ఐటీ, మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఫైఓవర్ నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ నగర రూపురేఖలను పూర్తిగా మార్చివేశారన్నారు. ఆ మహనీయుని సంక్షేమ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని మల్లాది విష్ణు అన్నారు. పేదవాడి సంక్షేమం కోసం రాజన్న రెండు అడుగులు ముందుకు వేస్తే.. జగనన్న వంద అడుగులు ముందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ.. వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ.. జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, నాయకులు కొమ్ము చంటి, నాగభూషణం, ఐటీ ప్రసాద్, క్రాంతి, సులోచనరావు, వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News