
-చికిత్సల్లో ఎదురవుతున్న సవాళ్లు, నవీన ఆవిష్కరణలపై విజ్ఞానదాయకంగా నిపుణుల ప్రసంగాలు
-ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ 6వ రాష్ట్ర స్థాయి మధుమేహ వైద్య సదస్సుకు విశేష స్పందన
-సదస్సుకు 600 మందికి పైగా వైద్య నిపుణులు, వైద్య విద్యార్థుల హాజరు
-ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహ వైద్య రంగంలో అనేక విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వెలుగుచూశాయని ఆర్ఎస్ఎస్డీఐ (రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా) ఏపీ చాప్టర్ కార్యదర్శి, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 6వ రాష్ట్ర స్థాయి మధుమేహ వైద్య సదస్సును ఆదివారం నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హోటల్లో జరిగిన ఈ సదస్సుకు మధుమేహ వైద్య నిపుణులు, వైద్య విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 600 మందికి పైగా ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో, వివిధ విభాగాల్లో ప్రఖ్యాతిగాంచిన 25 మంది ప్రఖ్యాత వైద్య నిపుణులు వేర్వేరు అంశాలపై చేసిన ప్రసంగాలు అత్యంత విజ్ఞానదాయకంగా సాగాయి. మధుమేహ వ్యాధి చికిత్సల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఆధునిక అధ్యయనాలు, నూతన ఆవిష్కరణలు, నవీన చికిత్సా పద్ధతుల గురించి సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ అంశాలపై ప్రతినిధుల సందేహాలకు నిపుణులు విశ్లేషణాత్మకంగా సమాధానాలిచ్చారు. ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ కార్యదర్శి, 6వ రాష్ట్ర స్థాయి మధుమేహ వైద్య సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ యలమంచి సదాశివరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత వైద్య విధానాలపై అవగాహన పెంపొందించుకునేందుకు, నూతన చికిత్సా పద్ధతులను అభ్యసించేందుకు వైద్య విద్యార్థులకు ఈ సదస్సు చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. మధుమేహవ్యాధి నియంత్రణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమ చికిత్సలను అందుబాటులోకి తేవడమే లక్ష్యాలుగా ఈ సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. అమెరికాలో ఇటీవల జరిగిన మధుమేహ వైద్య సదస్సులో అత్యాధునిక వైద్య చికిత్సా విధానాన్ని ఆవిష్కరించారని, ఆ నూతన చికిత్స అద్భుతమైన ఫలితాలను అందిస్తోందని వివరించారు. అమెరికాలో వినియోగంలోకి వచ్చిన నూతన మధుమేహ వైద్య చికిత్స గురించి ప్రస్తుతం నిర్వహిస్తున్న సదస్సులో చర్చించినట్లు డాక్టర్ సదాశివరావు తెలియజేశారు. సదస్సులో భాగంగా ఆర్ఎస్ఎస్డీఐ ఏపీ చాప్టర్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం కావించారు. ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్డీఐ అధ్యక్షులు డాక్టర్ సీహెచ్. వసంత్ కుమార్, ఏపీ చాప్టర్ నూతన అధ్యక్షులు, వైద్య సదస్సు నిర్వాహక కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ అలోక్ సచన్, కోశాధికారి డాక్టర్ పి. కృష్ణ ప్రశాంతి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎల్. వెంకట రమణారెడ్డి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ సీహెచ్. మనోజ్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ఎ. మైథిలి, డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ ఎ. పూర్ణానంద్, డాక్టర్ ఎన్. అమ్మన్న, డాక్టర్ యలమంచి హిమన తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News