Breaking News

ప్రజల ఆశీస్సులే జగనన్నకు కొండంత బలం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 200 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొండంత బలమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 27 వ డివిజన్ – 200 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి గులాబీతోటలోని సాయిప్రసన్నవీధి, నేతాజీ స్కూల్ రోడ్డు, సాయిబాబా స్ట్రీట్, గణపతి రావు వీధులలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 415 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు, మహిళలు హారతులు పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. జగనన్న పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. గత మూడేళ్ల కాలంలో సచివాలయ పరిధిలో రూ. 2.84 కోట్ల సంక్షేమాన్ని అందించామంటే కేవలం వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే సాధ్యపడిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా కష్ట సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవలందించారన్నారు. నిస్వార్థ సేవలకు ప్రతిరూపమైన వాలంటీర్లను ఏటా రాష్ట్ర ప్రభుత్వం సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో ఘనంగా సత్కరించడం జరుగుతోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించింనందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే సమక్షంలో కేట్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నూటికి నూరు శాతం పోషకాహారం అందించాలి
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించేలా ప్రతి ఒక్కరికి పోషకాహారం చేరే విధంగా అంగన్వాడీ సూపర్ వైజర్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీరు, వంటగది, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు రోజూ అందించే మెనూ గూర్చి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించాలని సూచించారు. పోషకాహారంతో పాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలను తెలియపరిచేవిధంగా సలహాలు, సూచనలు అందించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పేదల ఇళ్లను అడ్డుకుంటున్న పాపం చంద్రబాబుది కాదా..?
రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు అద్దెల భారంతో ఇబ్బందులు పడకాకూడదనే ఉద్దేశంతో.. అర్హతే ప్రామాణికంగా 96 వేల మంది నిరుపేద కుటుంబాలకు నగరంలో ఇళ్ల పట్టాలు కేటాయించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క పేదవాడికి సొంత గూడు కల్పించలేకపోయారని విమర్శించారు. పైగా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్లను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 9 వేల మంది పేదలకు ఇళ్లను దూరం చేసి పాపం మూటగట్టుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాలలో వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్ లో పేదల ఇళ్లను అడ్డుకోబోమని బహిరంగంగా స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. మరోవైపు వరదలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. హుదూద్, తిత్లీ తుఫాన్ల సమయంలో బాధితులకు ఏ మాత్రం పరిహారం ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నిత్యావసరాలు కూడా అందించలేదని.. పైగా కేంద్రం నుంచి వచ్చిన రూ. 1000 కోట్ల నిధులలో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులు పక్కదారి పట్టించారన్నారు. బాధితులకు సాయం ఎలా ఎగ్గొట్టాలన్నది చంద్రబాబు సిద్ధాంతమైతే.. ఎలా ఇవ్వాలన్నదే జగనన్న లక్ష్యమ‌ని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గోదావరి వరదలకు సంబంధించి దాదాపు లక్ష కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 వేలతో పాటు 25 కేజీల బియ్యం, నూనె, పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవ్వడం జరిగిందన్నారు.

పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అసమర్థతే కారణం
విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు కాకపోవడానికి చంద్రబాబు అసమర్థతే ప్రధాన కారణమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో అధికారాన్ని పంచుకుని కూడా పోలవరాన్ని పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. పైగా ఆర్ అండ్ ఆర్ గురించి నిర్లజ్జగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్ అండ్ ఆర్ కు ఒక్క రూపాయి కేటాయించలేదని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1,500 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. ఓటుకు నోటు కేసులో కేంద్రానికి లొంగిపోయిన చంద్రబాబుకి.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు వరుసగా 7 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన చంద్రబాబు.. తనకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అధికారంలో ఉండగా సొంత నియోజకవర్గం కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారని.. పైగా పోలవరం ముంపు మండలాలు, విలీన గ్రామాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాననడానికి సిగ్గుపడాలన్నారు. సొంత నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న మంగళగిరిలోనే గెలవలేకపోయిన నారాలోకేష్.. పులివెందులలో తెలుగుదేశాన్ని గెలిపించుకుంటామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్న ప్రభుత్వానికి రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ సాటి రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కురిటి శివ, పిల్లుట్ల వంశీ, మండా రాము, భవానీరెడ్డి, పసుపులేటి బుచ్చిబాబు, కగ్గా పాండు, తుపాకుల చంద్రశేఖర్, షేక్ కాజా, జానీ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *