విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు ఊరటనిస్తున్న సంక్షేమ పధకాలను ఉచితాల సాకుతో రద్దు చేసే కుట్ర జరుగుతోందని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్‌లోని బెజవాడ మీడియా సెంటర్‌లో ఆదివారం ‘‘ సంక్షేమ పధకాలు – ఉచితాలు – పర్యవసానాలు’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్. కృష్ణంరాజు చర్చను ప్రారంభిస్తూ, సమసమాజ స్ధాపన జరిగేంత వరకూ పేదవారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల వంటి పధకాలు ఉచితాల క్రిందకు రావని, అయితే నిజమైన సంక్షేమాన్ని అన్ని ప్రభుత్వాలు విస్తరిస్తున్నాయన్నారు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పధకాల రద్దు ద్వారా పేదలు హూందాగా జీవించే హక్కును కాల రాయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం నాయకుడు ఎల్. శివరామ ప్రసాద్ మాట్లాడుతూ, సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా అవసరమని, అయితే జగన్మోహనరెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది అనర్హులకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ కోట్లాది రూపాయల ధనాన్న వృధా చేస్తోందన్నారు. ఆంధ్రా అడ్వకేట్స్ అసోసియేషన్ కన్వీనర్ సాయిరాం మాట్లాడుతూ పేదలు దైనందిక జీవితంలో బ్రతకడానికి అవసరమైన వాటిని సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఫణిరాజు మాట్లాడుతూ, బి.జే.పి. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంక్షేమ పధకాలను రద్ధు చేయడానికి కుట్రలు పన్నుతోందని, ప్రధాని మోడీ ఔరంగజేబు లాగా అంత్యక్రియల పన్ను లాంటివి విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఎ.పి. ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేష్ మాట్లాడుతూ అప్పుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నవన్నీ తప్పులేనన్నారు. కార్పోరేట్ రంగానికి రాయితీలు ఇస్తూ, ప్రభుత్వ రంగ ఆస్తులను తమకు అనుకూలమైన పారిశ్రామిక వేత్తలకు విక్రయిస్తూ, బి.జె.ప. ప్రభుత్వం వారి నుంచి విరాళాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కాపునాడు అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం, బెజవాడ మీడియా సెంటర్ అధ్యక్షుడు చందన మధు, సీనియర్ పాత్రికేయుడు నగేశ్, ఒ.బి.సి. సంక్షేమ సంఘం నాయకుడు అంగిరేకుల వర ప్రసాద్, జై భీమ్ పార్టీ నాయకుడు కొండలరావు, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News