Breaking News

విద్యావ్యవస్ధకు మార్గదర్శిగా నిలవనున్న జాతీయ విద్యావిధానం

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-వైభవంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యలయం 37, 38వ స్నాతకోత్సవాలు
-సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకు గౌరవ డాక్టరేట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రపంచంలోనే అత్యుత్తమంగా భారతదేశాన్ని మార్చాలనే తపన ప్రతి ఒక్క విద్యార్ధిలోనూ ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విభిన్న రంగాలలో దేశం గణనీయమైన అభివృద్ది సాధించినప్పటికీ ప్రపంచదేశాలకు పోటీగా నిలవాలంటే అది బలమైన విద్యావ్యవస్ధ వల్లే సాధ్యమవుతుందన్నారు. శనివారం విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలకు గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ 34 ఏళ్ల పూర్వపు విద్యా విధానం స్ధానంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు అవుతుందని, ఈ విధానం యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, జవాబుదారీతనం అనే పునాదులపై నిర్మించబడిందన్నారు. సుస్ధిర అభివృద్ది 2030 ఎజెండాతో దేశాన్ని ఒక శక్తివంతమైన గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చడమే లక్ష్యంగా జాతీయ విద్యా విధానం పనిచేస్తుందన్నారు. 21వ శతాబ్దపు అవసరాల మేరకు పాఠశాల, కళాశాల విద్యావిధానాన్ని మరింత సమగ్రంగా తీర్చిదిద్దుతూ ప్రతి విద్యార్థి యొక్క నిభిడీకృత శక్తి సామర్థ్యాలను బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుందన్నారు.

ముఖ్య అతిథి, విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ మాట్లాడుతూ, తాను విద్యాభ్యాసం చేసిన విశ్వవిద్యాలయం నుండి గౌరవ డిగ్రీని అందుకోవటం చాలా గొప్పగా భావిస్తున్నానన్నారు. ఆధునిక స్వాతంత్య్ర భారతదేశంలో విద్య అనేది కేవలం ఆత్మజ్ఞానం కోసం సాగే వ్యవహారం కాదని, సామాజిక అభ్యున్నతి, ఆర్థిక విప్లవాన్ని కోరుకునే ఉద్యమమని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై రూపుదిద్దుకున్న ప్రస్తుత ప్రపంచంలో ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, భద్రతను నిర్ణయించేది విద్య మాత్రమేనన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలన్నారు. డిగ్రీ చదువుకున్న తర్వాత ఉద్యోగాన్వేషణలో ఉన్నపుడు నాగార్జున విశ్వవిద్యాలయ ఉద్యోగుల ప్రోద్బలంలోనే న్యాయవాద వృత్తిలోకి వచ్చానని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

నాగార్జున యూనివర్సిటీలో తమ అడ్డా క్యాంటీనేనని, ఇక్కడ కూర్చొని విభిన్న విషయాలపై చర్చించే వారిమని, తద్వారా సామాజిక అంశాలపై మరింత అవగాహనను పెంపొందించుకునేవారమన్నారు. ప్రస్తుతం యువతలో చర్చలు సాగటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు, పతకాలు అందుకున్న విద్యార్థులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గౌరవ అతిథిగా పాల్గొనగా, తొలుత విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య రాజశేఖర్ నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు అచార్య హేమచంద్రారెడ్డి , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *