-నాడు-నేడు పనులలో పురోగతి సాధించకుంటే చర్యలు తప్పవు..
-యంఇవోలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు-నేడు పనులలో అలసత్వం వహించి పురోగతిలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మండల విద్య శాఖ అధికారులను హెచ్చరించారు. నాడు-నేడు భవన నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మంగళవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మండల విద్యా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై యంఇవోలు ఇచ్చిన సమాదానాలపై జిల్లా కలెక్టర్ ఆసహనం వ్యక్తం చేస్తూ కబుర్లు చెప్పొద్దు.. సీరియస్‌గా పనిచేయండి.. అప్పగించిన పనులను పూర్తి చేయాల్సిన భాధ్యత మీ పై ఉంది. పనులు పూర్తి చేయాలన్న తపన పట్టుదల
ఉండాలంటూ యంఇవోలతో దిశానిర్థ్దేశం చేశారు. ప్రతి పాఠశాలలో ఆధునిక మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి కోట్లాదిరూపాయలు నిధులను విడుదల చేస్తుందన్నారు. కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్‌ను సమకూరుస్తున్నప్పటికి భవన నిర్మాణాలలో యంఇవోలు అలసత్వం వహించడం సహించరానిదన్నారు. యంఇవోలు సరిగా పనిచేయకుంటే విద్యావ్యవస్థ దిగజారుతుందన్నారు. సమస్యలపై అవగాహన ఉన్నపట్టికి ఆచరణలో శూన్యం కనిపిస్తుందన్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని ఇకపై ఇటువంటి పరిస్థితులు పునరావృత్తం కారాదని ఉత్సహంగా పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించకుంటే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. చేపట్టవలసిన భవన నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఎజెన్సీలతో నిర్మాణాల ఒప్పందాలను వెంటనే పూర్తి చేసి అగ్రిమెంట్ పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు పనుల ప్రగతిపై జిల్లా రెవెన్యూ అధికారి ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులతో స్వయంగా సంప్రదించి సమస్యలను తెలుసుకుని సమావేశం దృష్టికి తీసుకురావడం విద్యాశాఖ అధికారులు ఆలోచించుకోవాల్సిన విషయమన్నారు. ప్రతి రోజు నాడు-నేడు పనుల ప్రగతిని పరిశీలించి యంఇవోలకు సూచనలు ఇవ్వాలని ఎటువంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని విద్యాశాఖ అధికారిణి సివి రేణుకను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థల ప్రభావం ఇతర కారణాల వలన నిర్మాణాలకు అవకాశం లేనిపక్షంలో వెంటనే డేటా నుండి తొలగించాలన్నారు. చిల్లకల్లు జిల్లా పరిషత్ పాఠశాల భవన నిర్మాణానికి జిల్లా పరిషత్ అధికారులు స్థలాన్ని కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక శాసనసభ్యుని సమక్ష్యంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాటు చేయాలన్నారు. నాడు-నేడు భవన నిర్మాణాలను పనులను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు యంఇవోలు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి ప్రగతి నివేధికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, డిఇవో సివి రేణుక, ఐసిడిఎస్ పిడి జి.ఉమాదేవి,పాఠశాలల తనిఖీ అధికారి రవికుమార్, జిల్లాకు చెందిన మండల విద్యా శాఖ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News