Breaking News

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ‘అను మై బేబీ’ వైద్యులు


-నెలలు నిండకముందే జన్మించిన పసికందు
-కేవలం 650 గ్రాముల బరువుతో జన్మించిన బిడ్డ
-90 రోజుల పాటు నిరంతరం శ్రమించి పసికందు ప్రాణాన్ని నిలబెట్టిన వైద్య బృందం
-అను మై బేబీ విజయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం
-అను మై బేబీ Neonatal ICU doctors బృందానికి ప్రశంసల వెల్లువ

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
అను మై బేబీ హాస్పిటల్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. నెలలు నిండకముందే, కేవలం 650 గ్రాముల అతితక్కువ బరువుతో జన్మించిన పసికందు ప్రాణాలను అద్భుత వైద్యసేవలతో నిలబెట్టారు. 90 రోజుల పాటు నిరంతరం శ్రమించి, అనేక అవరోధాలను అధిగమించి ఆ తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపారు. దాదాపు 13 వారాల ముందుగా, 27వ వారంలోనే పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడి, ఆ పసిబిడ్డ ప్రాణాన్ని నిలబెట్టిన అను మై బేబీ NICU doctors బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎనికేపాడు అను మై బేబీ హాస్పిటల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సదరు చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ రాజా అశోక్ మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలకు చెందిన పావని అనే 28 ఏళ్ల మహిళకు గతంలో మూడుసార్లు గర్భస్రావం అయింది. అధిక రక్తపోటు, రక్తం త్వరితగతిన గడ్డకట్టడం వంటి అసాధారణ సమస్యలతో బాధపడుతున్న సదరు మహిళకు నాల్గవసారి గర్భం దాల్చగా, 900 గ్రాముల బరువుతో జన్మించిన బిడ్డ రెండోరోజనే మరణించింది. ఐదోసారి గర్భం దాల్చిన నేపథ్యంలో.. హైరిస్క్ ప్రెగ్నెన్సీ చికిత్సలు, అడ్వాన్స్డ్ నియోనేటల్ విభాగం ఒకేచోట కలిగిన అను మై బేబీ గురించి తెలుసుకున్న పావని దంపతులు ‘అను’ వైద్యులను సంప్రదించారు. అల్ట్రాసౌండ్ తదితర నిర్ధారణ పరీక్షల ద్వారా మాతృగర్భంలో బిడ్డ జీవించి ఉండటం అసాధ్యమని నిర్ధారించుకున్న వైద్యులు, 27వ వారంలో ఎమెర్జెన్సీ సిజేరియన్ చేశారు. 13 వారాల ముందుగా 650 గ్రాముల స్వల్ప బరువుతో పుట్టిన బిడ్డను తక్షణమే అడ్వాన్స్డ్ నియోనేటల్ అత్యవసర విభాగానికి తరలించి, 90 రోజుల పాటు కంటికి రెప్పలా సంరక్షించారు. బిడ్డ జీర్ణవ్యవస్థ ఆహారం తీసుకునేందుకు అనుకూలంగా లేనందున, అవసరమైన ప్రొటీన్లు తదితర పోషకాలను రక్తనాళాల ద్వారా నేరుగా అందజేశారు. ఈ 90 రోజుల చికిత్సా సమయంలో బిడ్డకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గుండెలో టీబీ, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, హైబీపీ వంటి సమస్యలకు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ, మూడు నెలల సుదీర్ఘ శ్రమతో పసికందును ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దారు. సదరు చికిత్సా సమయంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను అను మై బేబీ వైద్యులు తీసుకున్నారు. సిజేరియన్ తర్వాత తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో ఉన్న తల్లిని సంరక్షిస్తూనే, బిడ్డకు అమృతతుల్యమైన తల్లిపాలను అందించేలా చర్యలు చేపట్టారు. బిడ్డ ఎదుగుదలలో మాతృస్పర్శకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, వీలైనంత ఎక్కువ సమయం తల్లిని బిడ్డకు చేరువగా ఉండేలా చూశారు. పావనికున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో.. మాతృత్వ మాధుర్యాన్ని పొందేందుకు ఉన్న చిట్టచివరి అవకాశం అయినందున, ఈ కేసును సవాలుగా తీసుకున్న అను మై బేబీ వైద్యులు అకుంఠిత దీక్షతో చికిత్సనందించి, తల్లీబిడ్డల ప్రాణాలను నిలబెట్టడంలో సఫలీకృలయ్యారు. నెలలు నిండకముందు జన్మించిన వారిలో సహజంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మెదడులో రక్తస్రావం, కంటిలో ఆర్వోపీ సమస్యలతో భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే, సదరు సమస్యలేవీ లేకుండా, బిడ్డ పూర్తిగా కోలుకుని ప్రస్తుతం రెండుకిలోల శరీర బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. అను మై బేబీలోని ఎవిడెన్స్ బేస్డ్ చికిత్సా విధానం, వివిధ విభాగాల వైద్య నిపుణుల సంఘటిత కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైనట్లు డాక్టర్ రాజా అశోక్ పేర్కొన్నారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి. రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేషేంట్ కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వారిపై ఆర్థిక భారం పడకుండా, పలు ఎన్జీవోలు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరించామని, హాస్పిటల్ తరపున కూడా తగినంత మద్దతును అందించామని వివరించారు. మూడు నెలల పాటు నిర్విరామంగా కృషి చేసి పసిబిడ్డ ప్రాణాలను నిలబెట్టి, అను మై బేబీ విజయప్రస్థానంలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించిన నియోనెటాలజిస్టులు డాక్టర్ కోగంటి రాజా అశోక్, డాక్టర్ చలసాని అనూష, డాక్టర్ పేరూరి గురుప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ పావని మాణిక్య, కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్, అనెస్థటిస్ట్ డాక్టర్ సతీష్, అను మై బేబీ నర్సింగ్ సిబ్బందికి డాక్టర్ రమేష్ అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి, ప్రముఖ పెడియాట్రిక్స్ సర్జన్ మరియు క్లినికల్ డైరెక్టర్ డా కేవీ రవి కుమార్ వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *