జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజా వార్త :
ఖాతాదారుల ఆధారాభిమానాలు పొందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు సూచించారు.
జగ్గయ్యపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచ్‌ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యాపార రంగంలో దేశంలోనే రెండవ స్థానాన్ని పొందడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1000 బ్రాంచ్‌లు ఉండగా మన రాష్ట్రంలో 140 బ్రాంచ్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో 68 బ్రాంచుల ద్వారా ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను అందిస్తుందన్నారు. ఖాతాదారులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో సేవలందించిన్నపుడే బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వాన్ని ఎదుర్కోగలుగుతామన్నారు. విజయవాడ తరువాత జగ్గయ్యపేట నియోజకవర్గం వ్యాపార రంగానికి కీలమైనదన్నారు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వ్యాపార సంస్థలు ఉన్నాయని వీటితో పాటు వ్యవసాయ రంగంలో రైతులు వాణిజ్య పంటలను ఎక్కువగా పండిస్తారన్నారు. పారిశ్రామిక వేత్తలకు, రైతులకు అవసరమైన పంట రుణాలను సకాలంలో అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు అందించడంలోను ముద్ర రుణాలను మంజూరు చేయడంలో బ్యాంక్ అధికారులు ముందుకు రావాలన్నారు. ఔత్సాహికవంతులైన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి రుణాలను మంజూరు చేసిన్నట్లయితే వ్యాపారాన్ని మరింత విస్తృత పరిచి ఖాతాదారుల మన్ననులను పొందగలుగుతారని బ్రాంచ్ మేనేజర్ రవీంద్రకుమార్ ఈ విషయంలో సఫలీకృతం కావాలని కోరుతూ తొలి ఖాతాదారునికి పాస్ బుక్‌ను కలెక్టర్ డిల్లీరావు అందజేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయవాడ సర్కిల్ ప్రధాన అధికారి ఆర్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ 1895లో ప్రారంభమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 934 వేల కోట్ల రూపాయాల వ్యాపారాన్ని నిర్వహిస్తుందన్నారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయ దారులకు పారిశ్రామిక వేత్తలతో పాటు విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారుల అభిమానాన్ని పొందడమే ప్రధాన ఎజెండాగా తమ బ్యాంకు అధికారులు సేవలందిస్తారన్నారు. స్వయం సహాయ సంఘాలకు గృహా నిర్మాణాల లబ్దిదారులకు, వ్యవసాయ, విద్య రుణాలు అందించేందుకు కృషి చేశామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జగ్గయ్యపేట బ్రాంచి మేనేజర్ ఎస్ సురేంద్ర కుమార్, ఎజియం కె. రామయ్య, సీనియర్ మేనేజర్ (జిఐడి)బాలేశ్వరరెడ్డి, యూనియన్ అధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి పి నారయ్య, బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News