Breaking News

సెరిబ్రల్ పాల్సీకి ఆధునిక చికిత్సలు


-బుద్ధి మాంద్యం శారీరక రుగ్మత మాత్రమే..
-పిల్లలకు రెండేళ్లు వచ్చినా నడవలేకపోతుంటే సెరిబ్రల్ పాల్సీ కావచ్చు
-మెదడులో కణజాలం దెబ్బతినడంతో కండరాలు బిగుసుకుపోయే సమస్య
-సరైన చికిత్సలతో సక్రమంగా నడవగలిగే అవకాశం
-ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు
– సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా ఈనెల ఆరో తేదీన అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నపిల్లల్లో బుద్ధి మాంద్యంగా పిలువబడే సెరిబ్రల్ పాల్సీ సమస్యకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు తెలిపారు. ఈనెల ఆరో తేదీన వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే పురస్కరించుకుని అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్స్ నందు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ దుర్గా నాగరాజు మాట్లాడుతూ.. “నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డల్లోనూ, పుట్టిన వెంటనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడం, మూర్చరోగం వల్ల, తలకు దెబ్బతగలడం వంటి కారణాలతో సెరిబ్రల్ పాల్సీ సమస్య ఏర్పడవచ్చు. మెదడులోని కణజాలం దెబ్బతినడం వల్ల కండరాలు బిగుతుగానూ, వదులుగానూ మారిపోవడం వల్ల సంబంధిత శరీర భాగాలు సక్రమంగా పనిచేయలేవు. మెదడులో దెబ్బతిన్న కణజాలం ఆధారంగా సెరిబ్రల్ పాల్సీ రుగ్మతను మూడు రకాలుగా విభజించారు. రక్తపరీక్షలు, ఎక్స్-రేల ద్వారా సమస్యను గుర్తించడం సాధ్యం కాదు. బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సెరిబ్రల్ పాల్సీని నిర్ధారించవచ్చు. రుగ్మత కారణంగా పిల్లల ఎదుగుదల ఆలస్యమవుతుంది. కాళ్లు, చేతులకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోయి పిల్లలు నడవడలేకపోతారు. రెండేళ్ల వయసు దాటినా పిల్లలు నడవలేకపోతున్నట్లయితే సెరిబ్రల్ పాల్సీ కారణం కావచ్చు. కండరాల సమతుల్యత లోపించిన కారణంగా కాళ్లు, చేతులు వంకరపోవడం, గూని సమస్య తలెత్తడం గుర్తించవచ్చు. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. దెబ్బతిన్న మెదడు కణజాలాన్ని సరిచేయడం సాధ్యంకాకపోయినప్పటికీ.. ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్లు, ఆపరేషన్ల ద్వారా సెరిబ్రల్ పాల్సీ సమస్యకు చికిత్స అందించవచ్చు. అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా రోగుల జీవన శైలిని మార్చవచ్చు. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. కండరాలను సక్రమంగా పనిచేయించడంలోనూ, ఆపరేషన్ తర్వాత రోగి సక్రమంగా నడిచేందుకు ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుంది. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు బొటాక్స్ ఇంజెక్షన్ సత్ఫలితాలను ఇస్తుంది. బొటాక్ ఇంజెక్షన్ సహాయంతో బిగుసుకుపోయిన కండరాలను సడలింపజేసి సక్రమంగా నడిచేలా చేయవచ్చు. ఒకప్పుడు సెరిబ్రల్ పాల్సీ రోగులకు ఆపరేషన్ చేసేందుకు పదేళ్ల వయసు దాటే వరకూ వేచిచూసేవారు. ఆపరేషన్ తర్వాత రోగి నడిచేందుకు ఒకట్రెండు నెలల సమయం పట్టేది. బిగుసుకుపోయిన కండరాలకు ఆధునిక పద్ధతుల్లో ఒకే శస్త్రచికిత్స ద్వారా సరిచేసి, మెరుగ్గా నడవగలిగేలా చెయ్యవచ్చు. ఆపరేషన్ అనంతరం కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రోగి నడవడం ఆరంభించవచ్చు. కండరాల బిగువును బట్టి మూడేళ్ల వయసు దాటిన అనంతరం ఎప్పుడైనా ఆపరేషన్ చేయవచ్చు. బుద్ధి మాంద్యం శారీరక రుగ్మత మాత్రమే.. అత్యాధునిక చికిత్సల ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగుల భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దవచ్చని, వారి జీవన స్థితిని మెరుగ్గా మార్చడం మన చేతుల్లోనే ఉంది” అని తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సెరిబ్రల్ పాల్సీ కారణంగా నడవలేని, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు, కాలు, చేయి వంకర, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. సెరిబ్రల్ పాల్సీ కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలను తిరిగి నడవగలిగేలా చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దుర్గా నాగరాజు కోరారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *