-మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 17.96 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు సంజీవని వంటిదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా 17 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 17.96 లక్షల విలువైన చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. అభాగ్యులకు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయనిధి చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. కష్టాల్లో ఉన్న వారి కోసం వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వందలాది కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నట్లు వివరించారు. గత మూడేళ్లలో సెంట్రల్ నియోజకవర్గంలో 911 మందికి రూ. 4 కోట్ల 33 లక్షల 14 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 88 మందికి రూ. 2 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 6 కోట్ల 59 లక్షల 26 వేల లబ్ధి చేకూర్చడం జరిగిందని వివరించారు.
మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందజేత
58వ డివిజన్ కు చెందిన కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి తోట అంజయ్య కుమారుడు తోట పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రమాదవశాత్తు మద్రాస్ నగరంలో సముద్రంలో మునిగి మృతి చెందారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా రూ. 5 లక్షల సహాయ నిధి విడుదల చేయడం జరిగింది. ఈ చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మూడు రాష్ట్రాల్లో పథకం వర్తించేటట్లు చర్యలు తీసుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గత సర్కారు హయాంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికమని వివరించారు. అలాగే నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత పటిష్ట పరుస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అయోధ్య నగర్లో రూ. 80 లక్షల నిధులతో ఇటీవల ప్రారంభించుకున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో 10 అవార్డులు ఇవ్వగా.. ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రావడం మనందరికీ గర్వకారణమన్నారు. అలాగే రోగులు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న ఆస్పత్రులపై అవగాహన కలిగి ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబసభ్యులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. అహర్నిశలు ప్రజల్లో ఉంటూ ప్రజల బాగోగులను చూసే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ గణేష్, శర్వాణీ మూర్తి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News