విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య యుగంలో శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవచ్చని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం ఈ విషయంలో నాయకత్వ పాత్ర పోషిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) నిర్వహిస్తున్న ఉపన్యాసాల పరంపరలో భాగంగా “స్వాతంత్ర్య పోరాటం, ప్రగతిశీల భారతదేశం @75” అనే అంశంపై గవర్నర్ న్యూఢిల్లీలోని ఇగ్నో మైదాన్ గర్హిలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సయోధ్య కోసం మన ప్రధాని ప్రయత్నించారని వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రజలలో దేశభక్తిని పునరుజ్జీవింపజేసిందన్నారు. ఆర్థికంగా, సైనికపరంగా భారత్ బలమైన దేశంగా గర్విస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, సహా ఉప కులపతులు ప్రొఫెసర్ సత్యకం, ప్రొఫెసర్ ఉమా కంజిలాల్, ప్రొఫెసర్ మన్రూప్ సింగ్ మీనా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News