– ఆధునిక సాంకేతికతతో మెరుగులు
– పూర్తిగా స్టీల్ రైలింగ్, బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం చేయాలి
– ప్రజల శ్రేయస్సు కంటే డబ్బు ముఖ్యం కాదు
– ఎంపి భరత్ రామ్
-ఆర్ అండ్ బి, రైల్వే అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాం
-రైల్వే అదనపు డి జి ఎమ్. డి. శ్రీనివాస్
-ఆర్ అండ్ బి , రైల్వే అధికారులతో కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ కం రైల్ వంతెన నడక మార్గంలో పాదచారులకు అత్యంత ప్రమాదకరంగా కొవ్వూరు, రాజమండ్రి వైపు రైలింగ్ ఉండడం వలన ఆర్ అండ్ బి , రైల్వే అధికారులు తనిఖీలు చేపట్టి తక్షణ మరమ్మత్తులు కోసం నివేదిక రూపొందించడం జరిగిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ పేర్కొన్నారు. శనివారం ఆర్ అండ్ బి , రైల్వే అధికారులు తనిఖీలు చేపట్టిన అనంతరం పార్లమెంట్ సభ్యులు తో మరోసారి రాజమండ్రి నుండి కొవ్వూరు వరకు రైలింగ్ మరమ్మత్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమండ్రీ రోడ్ కం రైల్వే వంతెన కు సంబందించి ప్రయాణాలు చేసినా, పాదచారులు నడిచే ఫుట్ పాత్ లు పాడై పోయి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న దృష్ట్యా నెలన్నర క్రితం సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ కు లేఖ వ్రాయడం జరిగిందన్నారు. ఆలేఖకు స్పందించి ఆర్ అండ్ బి రైల్వే శాఖ అధికారులతో చేపట్టవలసిన పనులపై ఒక అంచనాకు రావడం జరిగిందన్నారు. రైల్వే, ఆర్ అండ్ బి లు రేషియో విధానంలో శాశ్వత ప్రాతపదికన పనులు చేపట్టే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు.రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు, రాజమండ్రి నగర ఐకానిక్ బ్రిడ్జి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి చాలా వరకూ దెబ్బతిందని, ఈ బ్రిడ్జిపై జరుగుతున్న మరమ్మతు పనులను రైల్వే, ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారని చెప్పారు. వారితోపాటు తాను కూడా రాజమండ్రి నుండి కొవ్వూరు వరకూ బ్రిడ్జిని పరిశీలించానని చెప్పారు. ఈ వంతెన 1974లో నిర్మించారని, దీని లైఫ్ టైం అరవై ఏళ్ళు కాగా, ఇప్పటికే నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ బ్రిడ్జి రవాణా సేవలు అందించగలదైనా, గట్టితనం కోల్పోవడం, రెయిలింగ్స్, పుట్ ఫాత్, రోడ్డు..ఇలా అన్నీ దెబ్బతిన్నాయని ఆయన వివరించారు. బ్రిడ్జికి పలుచోట్ల డ్యామేజ్ అయిందాని, ఫుట్ పాత్ ప్లేట్స్ కూడా అక్కడక్కడా పూర్తిగా పాడైపోయి ప్రమాద భరితంగా ఉందన్నారు. రెండు చోట్ల ఏకంగా పది పదిహేను మీటర్లు పుట్ పాత్ రైలింగ్ ఒకవైపునకు ఒరిగిపోయిందన్నారు. స్వయంగా చూసిన తరువాతనే రైల్వే జీఎంకు లేఖ రాశానని, దానికి ఆయన వెంటనే స్పందించి తమ శాఖ అధికారులతో తనిఖీ చేపట్టి నిర్వహణ నిమిత్తం ఒక అంగీకారానికి వచ్చి , అందుకు అనుగుణంగా కేంద్రం 7.28, మన రాష్ట్రం 2.72 రేషియాలో మరమ్మతు పనులకు వెచ్చించవలసి ఉంటుందన్నారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ నెల 14 నుంచే రైల్వే, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా మరమ్మతు పనులు ప్రారంభించారని ఎంపీ భరత్ తెలిపారు.
ప్రస్తుత వంతెన కాల పరిమితి ను దృష్టిలో పెట్టుకొని మరో కొత్త వంతెనకు ప్రతిపాదన ఇప్పట్నుండే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. మరో కొత్త వంతెనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందని అభిప్రా యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెనను ఏదో తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రైల్వే, ఆర్ అండ్ బీ అధికారులను కోరినట్టు ఎంపీ తెలిపారు. పదీ పదిహేను రోజుల్లో ప్రస్తుతం చేపట్టే తాత్కాలిక పనులు పూర్తయినా, బ్రిడ్జి స్టీల్ రైలింగ్, పుట్ పాత్, రోడ్డు, లైటింగ్ అన్నిటినీ పూర్తిగా మార్చి సరికొత్త అందాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్నట్టు ఎంపీ తెలిపారు.
రైల్వే అదనపు డి ఆర్ ఎం (ఇన్ ఫ్రా) డి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, రైల్వే ఆధ్వర్యం లో సంయుక్త తనిఖీ లు చెయ్యడం జరిగిందన్నారు. అందులో భాగంగా చాలా చోట్ల రైలింగ్ పాడై పోయినట్లు గుర్తించామన్నారు. వాటికి సంబందించి మరమ్మత్తుల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఈ వంతెనకు సంబందించిన సపోర్టింగ్ సిస్టం ( మద్దతు వ్యవస్థ) కు చెందిన పనులు చేపట్టవలసి ఉందని, వాటిపై ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి అధికారులను కోరా మని, ఆ వివరాలు అందవలసి ఉందన్నారు. ఈ వంతెన మరామ్మత్తులు తాత్కాలికంగా కాకుండా కొత్త బ్రిడ్జి నిర్మించే వరకు ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలు నిర్వహించవలసి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా తక్షణం చేపట్టవలసి ఉన్న 16 ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. గోదావరి పై నిర్మించిన రైల్వే వంతెనల పటిష్టత ను దృష్టి లో ఉంచుకుని రైల్ వంతెన సమీపంలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఎటువంటి ఇసుక తవ్వకాలు, ఇసుక రీచ్ లు లేకుండా చూడాలని శ్రీనివాస్ కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె. మాధవీలత రైల్వే, ఆర్ అండ్ బి అధికారులతో తనిఖీలకు సంబంధించి అంశాలపై సమీక్ష నిర్వహించారు.రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ యూ.అక్కిరెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ ఎస్బివి రెడ్డి లతో ప్రస్తుతం చేపడుతున్న పనులు దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చెయ్యాలని, అందుకు అనుగుణంగా అదనపు నిధులు మంజూరు కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ముఖ్యంగా వంతెన మార్గం లో రోడ్ ల మధ్య గ్యాప్, ఫుట్ పాత్ మార్గం, రైలింగ్ పనుల విషయంలో అత్యంత జాగ్రత్తగా పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరలో వాటిని పూర్తి చెయ్యాలని సూచించారు.
రైల్వే అదనపు డి ఆర్ ఎం (ఇన్ ఫ్రా) డి. శ్రీనివాస్, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్ కే. హరిప్రసాద్ బాబు, రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ యూ.అక్కిరెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు ఎస్ బి వి రెడ్డి, బివి మధుసూదన రావు, పి. గిరి ప్రసాద్ వర్మ, రైల్వే సీనియర్ డి ఎం (విజ్) శ్రీనివాస రావు, అదనపు డి ఈ ఎన్ ఎమ్. గణేశన్, రైల్వే సి ఐ బి. సైదయ్యా, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News