Breaking News

‘గృహ నిర్మాణం’లో ఏపీ దేశానికే రోల్ మోడల్!

-వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణంతో చక్కని ఉదాహరణగా నిలుస్తాం
-లబ్ధిదారులకు అత్యుత్తమ, అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
-జాతీయ సదస్సులో ఏపీ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడి
-ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
-ఇంధన సామర్థ్య, ఇండో-స్విస్ బిల్డింగ్, ఇతర ఆధునిక టెక్నాలజీల అమలు
-17005 లే అవుట్లలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా అందజేశాం
-రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమి పంపిణీ
-లే అవుట్ల అభివృద్ధికి రూ.3525 కోట్ల వ్యయం
-ఆధునిక మౌలిక వసతులకు రూ.32,909 కోట్లు
-ఇంతటి ఖర్చుతో, అత్యాధునిక లే అవుట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వలేదు
– పేదలకు అందమైన సొంతిళ్లు అందజేయడమే సీఎం లక్ష్యం
-అందుకోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు: అజయ్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పాదాయ, వెనకబడిన వర్గాల ప్రజలు నాణ్యమైన జీవితం గడపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా పేదలకు సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తోంది. జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఈ ఇళ్లలో సమస్త మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లలో అధునాతన, నవీన టెక్నాలజీలను వినియోగిస్తూ అత్యుత్తమ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది. గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సంబంధించిన సమగ్ర వివరాలను.. గుజరాత్ లోని రాజ్ కోట్లో కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించిన జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనంలో శుక్రవారం విజయవంతంగా ప్రదర్శించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనంలో పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. నిర్మాణాల్లో నవీన పద్ధతులు, అందుబాటు ధరల్లో నిర్మాణాలు, విజన్ ఇండియా 2047 రోడ్ మ్యాప్, వివిధ భాగస్వాముల సామర్థ్యాల పెంపు, లబ్ధిదారులకు వేగంగా, చౌకగా నిర్మాణాలు చేపట్టే టెక్నాలజీలపై చర్చించనున్నారు. ఈ సమ్మేళనంలో ఏపీ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీలతో ఇంధన సామర్థ్య కార్యక్రమాలనూ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇండో-స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీ కాస్ట్ టెక్నాలజీ, షియర్ వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ తదితర అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
గృహ నిర్మాణ లబ్ధిదారులు నాణ్యమైన జీవితం గడిపేలా అత్యాధునిక మౌలిక సౌకర్యాలు, వసతులతో ఇళ్లు నిర్మించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని అజయ్ జైన్ చెప్పారు. కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని.. గృహ నిర్మాణ ప్రాజెక్టును విశిష్ట, విభిన్న పద్ధతుల్లో చేపడుతున్నామని తెలిపారు. 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీయే అని చెప్పారు. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. దీంతో పాటు లే అవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో లే అవుట్లు వేసిన రాష్ట్రం ఏపీ తప్ప దేశంలో మరొకటి లేదని అన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యావత్ దేశానికే ఒక చక్కని ఉదాహరణగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్యశాలలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, బ్యాంకులు, స్టేడియంలు, మతపరమైన భవనాలు, డంపింగ్ యార్డులు, శ్మశానాలు, తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు అజయ్ జైన్ వెల్లడించారు. ఇంకా 20 నుంచి 60 అడుగుల సీసీ రోడ్లు, ఓపెన్; భూగర్భ డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించనున్నట్లు తెలిపారు.
అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజయం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో అందమైన ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అజయ్ జైన్ స్పష్టం చేశారు. వెనకబడిన తరగతుల వారి కోసం చేపట్టిన గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతం చేయడంతో పాటు ఈ విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపేందుకు ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి 20 ఎంటీ ఇసుకను ఉచితంగా అందజేస్తోందన్నారు. అలాగే సిమెంట్, స్టీల్, తలుపులు, ఇతర సామగ్రిని రాయితీ ధరలకే అందిస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.
హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నుండి అవార్డును అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి అభినందించారు. జెఎండి హౌసింగ్ ఎం శివ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ జివి ప్రసాద్ మరియు ఎపి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇతర సీనియర్ అధికారులు కూడా కాన్క్లేవ్లో పాల్గొన్నారు.
ఒక్కో ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 2 ఇంధన సామర్థ్య ఫ్యాన్లను గృహ నిర్మాణ శాఖ అందజేయనున్నట్లు అజయ్ జైన్ తెలిపారు. దశలవారీలో భాగంగా తొలిదశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్ సాయంతో వీటిని అందజేస్తున్నట్లు వివరించారు. ఈ ఉపకరణాలను అందజేయడం ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చని.. తద్వారా 15.6 లక్షల ఇళ్లకు 1145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు.
గృహ నిర్మాణ శాఖ ఇండో- స్విస్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డింగ్ టెక్నాలజీ వినియోగంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జైన్ తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల ఇంటి లోపల కనీసం 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. ఇండో-స్విస్ బీఈఈపీ సిఫారసు చేసిన లెక్కల ప్రకారం ఇళ్లలోకి పగటి పూట సాధారణ వెలుతురు బాగా వస్తుందని, కనీసం 20 శాతం కరెంటు ఆదా అవుతుందని వివరించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలులో అనేక ఐటీ ఆధారిత కార్యక్రమాలను చేపట్టినట్లు అజయ్ జైన్ తెలిపారు. ఏపీఎస్ హెచ్సీఎల్ వెబ్ సైట్ ద్వారా భౌతిక, ఆర్థిక పర్యవేక్షణ ఉంటుందన్నారు. సామగ్రి సేకరణ, పంపిణీ ఏపీ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా జరుగుతుందని.. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్ లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *