– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 61.84 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సెంట్రల్ లో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా జరుగుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శ్రీనగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో రూ. 61.84 లక్షల విలువైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిలతో కలిసి గురువారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నగరం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యంగా సెంట్రల్ ప్రాంతంలో ప్రగతి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా శ్రీనగర్ కాలనీలోని 2 వ క్రాస్ రోడ్డు నుంచి 3 వ క్రాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, 4 వ లైన్ లో సీసీ రోడ్డు ఎత్తు పెంచడం, టీచర్స్ కాలనీలోని 3వ లైన్ లో సీసీ రోడ్డు ఎత్తు పెంచడం, 31వ డివిజన్ పార్క్ నుంచి రామాలయం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో రహదారుల నిర్వహణను కనీసం పట్టించుకోకపోవడంతో.. నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రాంతమంతా నూతన రహదారులతో కళకళలాడుతోందన్నారు. ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పదిరోజుల్లోగా పనులు పూర్తిచేయవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, వీరమాచనేని లలిత, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు కనపర్తి కొండ, బెజ్జం రవి, సామంతకూరి చిన్నా, పట్టాభి రామరాజు, జయకర్, మానం వెంకటేశ్వరరావు, ఆకెళ్ల శ్రీనివాస్, నరసరాజు, వేదాంతం చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News