విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఆర్జీలను అధికారులు పూర్తిగా పరిశీలించి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధిత ఆర్జీదారులు, అధికారులతో శనివారం కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. స్పందన ఆర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పునరావృతం కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) 5 ఆర్జీలకు సంబంధించి సమస్యలను ఆర్జీదారులు, అధికారులతో ముఖాముఖీ ద్వారా పరిష్కారం చూపారు. జగ్గయ్యపేట మండలం రైల్వే వ్యాగన్ రోడ్‌కు చెందిన కేల్లి కౌసల్య, విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన బోయన హేరంబకుమార్, కంచికచర్ల మండలం కేసరగ్రామానికి చెందిన వెల్పుల రమేష్, విజయవాడ రూరల్ గూడవల్లికి చెందిన దేవుళ్లపల్లి విజయ్‌వర్మ, రెడ్డిగూడెం అన్నరావుపేటకు చెందిన కొత్త వెంకటరత్నంలకు సంబంధించిన రెవెన్యూపరమైన సమస్యలను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు గూగుల్ కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించారు.
Prajavartha Online Telugu News