

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శ్రీశ్రీశ్రీ త్యాగరాజస్వామి వారి 6వ ఆరాధన మహోత్సవములు నాయీ బ్రాహ్మణ వాయిద్య వృత్తి కళాకారుల శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్‌ఛైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరై తమ సహకారంగా వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి వారికి గుర్తింపు తెచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. కళాకారుల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా ఆయనను ప్రజాబంధు బిరుదుతో సత్కరించారు. వారితోపాటు రాజకీయ ప్రముఖులు, నగర ప్రముఖులు, పలు రంగాల ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. నిర్వాహకులు శిక్షణా కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు, ప్రధాన కార్యదర్శి ఇంటూరి మురళీకృష్ణ, రాయవరపు నానాజీ తదితరులు మాట్లాడుతూ 7 తరాల నుండి ఈ వృత్తిలో వుంటూ కళాకారులను శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాంప్రదాయ వృత్తిగా గుర్తించాలన్నారు. తమ పిల్లలకు నేర్పి వారి ద్వారా వారి తర్వాత వారికి ఇలా ఒకరి తరువాత ఒకరికి వృత్తి నేర్పుతూ వస్తున్నామన్నారు. దేవాలయాలలో సుమారు 1470 నాదస్వరం, డోలు పోస్టులు భర్తీ చేయవలసి వుందన్నారు. టెంపరరీగా వున్న వారి జీతభత్యాలను పెంచి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ విద్య నేర్చుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని అటువంటి ఈ విద్యను గుర్తించి అన్ని వాయిద్య వృత్తులులాగా తమకు పోటీలు నిర్వహించి అవార్డులు ప్రకటించాలని కోరారు. అందరి కళాకారులతోపాటు మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్వాంసులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భాషా సాంస్కృతిలో భాగంగా గుర్తించాలన్నారు. తమ తరువాత తరాల వారు తమ వృత్తి విద్యతోపాటు ఇప్పుడు డిప్లొమా కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్ కోర్సులు చదువుతున్నారని వారికి ప్రభుత్వం సరైన ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. డోలు, సన్నాయి, నాదస్వరం కళాకారులను గుర్తించి వారికి వారి విద్యకు సముచిత స్థానం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆస్థాన విద్వాంసులు నరసపురం సురేష్ నాదస్వరం, విప్పిలి శంకర్ నాదస్వరం, వాసుదేవన్ డోలు ఆలిండియా చక్రవర్తి, మనోహర్ ప్రకాశం జిల్లా లయజ్ఞానజ్యోతి డోలు విద్వాంసులు తమ విద్యతో అందరిని అలరించారు. వేముల హజరత్తయ్య గుప్త సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నిడమానూరి యలమందరావు, కళాకారులు సీహెచ్ సీతయ్య, మల్కాపురం కనకారావు, ఉప్పలపాటి వసంతరావు, పొదలి శ్రీనివాస్, సిహెచ్.రాజేశ్వరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వివిధ రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో కళాకారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News