-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్ లో ఘనంగా సాయిధ దళాల పతాక దినోత్సవం
-వీరనారీమణులను ఘనంగా సత్కరించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాయిధ దళాలు సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా దేశ అంతర్గత సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు మొదలైన క్లిష్ట పరిస్థితులలో మనకు అండగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్భవన్లో శుక్రవారం సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయుల ఆలోచనల్లో సాయుధ దళాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకుంటున్నామని, ఇది వారిని గౌరవించుకునే శుభతరుణమన్నారు. సాయిధ దళాల శౌర్యం, విధి నిర్వహణ పట్ల అంకిత భావం, అత్యున్నత స్థాయి వృత్తి నైపుణ్యం దేశానికి భిన్న రూపాలలో సహాయకారిగా ఉందన్నారు. యుధ్ద క్షేత్రంలో ప్రత్యర్ధులపై సమరభేరి మోగించి అత్యున్నత త్యాగాలతో స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారన్నారు.
మాతృభూమి రక్షణలో తమ ఆత్మీయులను కోల్పోయిన వీరనారీమణులను ఈ సందర్భంగా సన్మానించం మన అదృష్టమన్నారు. సైనికుల నుండి యుద్ధం అత్యున్నత త్యాగాలను కోరుతుందని, కాని వారి కుటుంబ సభ్యులకు అపారమైన కష్టాలను తెస్తుందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబాల పట్ల ప్రభుత్వాలు, పౌరులు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. 2021 సాయుధ దళాల పతాక దినోత్సవం నేపధ్యంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారులుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రసన్న వెంకటేష్, ప్రశాంతి అత్యధిక నిధిని సమకూర్చటం స్పూర్తి దాయకమన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి తమ వార్షిక విరాళాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అభినందనీయిలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయిధ దళాల కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు వెంకట రెడ్డి గవర్నర్ కు పతాక దినోత్సవ స్టిక్కర్ ను అందించి పతాక నిధికి విరాళం స్వీకరించారు. వీరనారీలు ఐశ్వర్య, లక్ష్మి, సత్యకళ, మమతలతో పాటు, నాయక్ సుభాన్ షైక్, గ్యాలంట్రీ అవార్డు పొందిన అంజనేయిలు, రెండవ ప్రపంచ యుద్దంలో పాలుపంచుకున్న నిమ్మగడ్డ నాగభూషణంలను గౌరవించి ఒక్కొక్కరికీ రూ.25వేల నగదు పురస్కారాన్ని గవర్నర్ అందించారు. సాయిధ దళాలకు ఆర్ధిక తోడ్పాటులను అందించాలన్న గవర్నర్ పిలుపు నేపధ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ , చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ లక్ష రూపాయల వంతున, టి భోగేశ్వరరావు తదితరులు ఐదు లక్షలు సమకూర్చారు. మరోవైపు గవర్నర్ స్వయంగా లక్ష రూపాయలు అందించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, హోం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ , ఉప కార్యదర్శి నారాయణ స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.