-చదువులో వెనుక బడిన విద్యార్థులకు బడి గంటల అనంతరం స్వచ్ఛందంగా పాఠాలు బోధన
-పాఠశాల విద్యా కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలోని బడి గంటల అనంతరం 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘అభ్యసన అభివృద్ధి స్థాయి’ Learning Improvement Program (LIP) ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సమగ్ర శిక్షా, యూనిసెఫ్, సిప్స్(Centre for Innovations in Public Systems (CIPS), సెవ్ ద చిల్డ్రన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సిప్స్ తో అవగాహన ఒప్పంద పత్రం(MoU) అనుబంధంపై సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం ప్రకారం డిగ్రీలోపు విద్యార్థులను సామాజిక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలనే నిబంధన ఉందని, దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరియు బీసీడీఈ (Board for Community Development through Education)ల సహకారం ఉంటే 6,7,8వ తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి మరింత సులభతరమవుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి వారి ద్వారా పిల్లల్లో ఉన్న అభ్యసన అంతరాలను తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.
సిప్స్ (Centre for Innovation in Public Systems) డైరెక్టర్ డా. వల్లి మానిక్కం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి కరదీపికలను రూపొందించి ఇచ్చామని తెలిపారు.
అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ..
చైల్డ్ ఇన్పో ద్వారా పిల్లలను గుర్తించి డిగ్రీ విద్యార్థులతో మ్యాపింగ్ చేస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు బోధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. వై.నజీర్ అహ్మద్, సేవ్ ది చిల్డ్రన్ దక్షిణ భారత ఎడ్యుకేషన్ ప్రతినిధి శ్రీనగేశ్, బీసీడీఈ కార్యదర్శి, సీఈవో ప్రొ. ఎం.ఎల్.ఎస్.దేవకుమార్, సిప్స్ కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్. ఉపేందర్ రెడ్డి, సిప్స్ ప్రతినిధులు శ్రీ విద్య, యూనిసెఫ్ కన్సల్టెంట్ స్వాతి దేవ్, సుదర్శన్, సీమ్యాట్ లెక్చరర్లు ప్రసాద్, సతీష్ , ఇస్మాయిల్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News