Breaking News

పండుగ వాతావరణంలో నూతన పింఛన్ల పంపిణీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి లబ్ధిదారుల పాలాభిషేకం

-చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ పింఛ‌న్ కానుక ప‌థ‌కం అమ‌లు
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ పింఛన్ కానుక పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం వచ్చిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురం, చుట్టుగుంట, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, వాంబేకాలనీలలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలతో కలిసి ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు గత పాలనలో పింఛనుదారులలో ఒకరు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్‌ ఇచ్చే వారు కాదని పేర్కొన్నారు. అటువంటి అమానవీయమైన విధానానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్తి పలికారన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని.. కానీ ఈ ప్రభుత్వంలో 64.06 లక్షల మందికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 1,765 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రతినెలా రూ. 7 కోట్ల 22 లక్షల 54 వేలు పింఛన్ రూపంలో అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. చంద్రబాబు హయాంలో నియోజకవర్గంలో 17 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 26,118 కు పెంచడం జరిగిందన్నారు. గతంలో పోలిస్తే దాదాపు రూ. 10 వేల మందికి అధికంగా ఈ ప్రభుత్వం పింఛన్ ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఒక్క నెలలోనే 957 మందికి నూతన పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్‌ డబ్బును అందజేస్తున్నారన్నారు.
చంద్రబాబు హయాంలో వ్యవస్థలన్నీ అవినీతిమయం
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్ల వ్యవస్థను పూర్తి అవినీతిమయం చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారికి, ఖరీదైన కార్లలో తిరిగే వారికి పింఛన్ ను మంజూరు చేసిన ఘనత గత టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కొత్తగా ఏ ఒక్క పింఛన్ మంజూరు చేసినా.. 3 నెలల పింఛన్ మొత్తాన్ని లంచంగా చెల్లించాల్సి వచ్చేదని గుర్తుచేశారు. పైగా 5 డివిజన్లకు కలిపి ఒకచోట ఎండలో కూర్చోబెట్టి పింఛన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని దుయ్యబట్టారు. ఫలితంగా అవ్వాతాతలు పింఛన్ డబ్బులో సగం ఆటో ఖర్చులకే చెల్లించాల్సి వచ్చేదన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే వాలంటీర్లు వెళ్లి పింఛన్ అందించే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సెలవు రోజైనా ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ ను అందిస్తున్నట్లు తెలిపారు. డోర్‌ డెలివరీ పద్ధతిలో పెన్షన్లు అందించడం దేశంలోనే తొలిసారి అని తెలియజేశారు.
పింఛన్లపై క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి
పింఛన్లపై మాట్లాడే నైతిక అర్హత రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని మల్లాది విష్ణు అన్నారు. అవ్వాతాతలకు అందించే పింఛన్లలోనూ ప్రతిపక్షాలు క్షుద్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏటా జరిగే సామాజిక సర్వేని కూడా వక్రీకరించి పింఛన్లను తొలగిస్తున్నారంటూ.. లబ్ధిదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఏ ఒక్క పింఛన్ ను కూడా ప్రభుత్వం తొలగించలేదని.. నోటీసులు ఇచ్చిన వారికి సైతం పింఛన్లు అందించినట్లు మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కోతలు విధించడం, మేనిఫెస్టోని మాయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించినట్లు తెలిపారు. దీని ద్వారా ఎన్నో లక్షల మందికి నూతన పింఛన్లు తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. కనుక మాటల ప్రభుత్వానికి, చేతల ప్రభుత్వానికి మధ్యగల వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలను కోరారు.
పింఛన్ పెంపుపై లబ్ధిదారుల సర్వత్రా హర్షం
కె.వాసు, పింఛన్ దారుడు(వాంబేకాలనీ) మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబుకు వృద్ధులు గుర్తుకోచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రభుత్వం అవ్వాతాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తోందని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యను విన్నవించిన వెంటనే పరిష్కారానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చూపిన చొరవ మరువలేమన్నారు. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూతకు గానూ సీఎం వైఎస్ జగన్ గారికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాలలో సిడిఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *