విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు మరింత మెరుగైన నాణ్యమైన విద్య అందించేందుకు ట్యాబ్లు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ఫ్రీలోడెడ్కంటెంట్తో రూపొందించిన ట్యాబ్ల పనితీరు, విద్యార్థులు ఉపయోగిస్తున్న విధానాన్ని గురువారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు నగరంలోని బిషప్అజరయ్య బాలికల ఉన్నతపాఠశాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు సైతం డిజిటల్ విధానంలో విద్యను అందుబాటులో తీసుకువస్తూ, పాఠ్యంశాలను మరింత సులభతరంగా అర్థమయ్యే రీతిలో రూపొందించిన ట్యాబ్లను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ ఫ్రీలోడెడ్కంటెంట్తో రూపొందించిన శామ్సంగ్ ట్యాబ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 14 వేల మందికి పైగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశామన్నారు. అన్ని పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వీడియో, ఆడియో, త్రీ డైమన్షన్తో బోధన జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ ట్యాబ్లను సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడే విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి.
పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు ముఖ్యంగా బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి శీలీంద్రం పై అలెగ్జాండర్ప్లెమింగ్ కనుగొన్న పెన్సిలిన్ యాంటీబయోటిక్ పాఠ్యాంశాన్ని విద్యార్థులకు కలెక్టర్ బోధించారు. పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో ఏకాగ్రతతో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రణాళిక బద్దంగా చదువుకొని పబ్లిక్ పరీక్షలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
Prajavartha Online Telugu News