Breaking News

మీ సేవలు వెలకట్టలేనివి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మీ సేవలు వెలకట్టలేనివి. మీరు లేనిదే ప్రజారోగ్యం లేదు. గ్రామాభివృద్ధిలో మీతోనే తొలి అడుగు. మిమ్మల్ని గౌరవించుకోవడం మా కర్తవ్యమంటూ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాకు చెందిన ఉత్తమ పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
జిల్లా పంచాయితీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 16 మంది ఉత్తమ పారిశుధ్య కార్మికులను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆయన నివాస గార్డెన్ లో ఘనంగా సన్మానించి ఒక్కొక్కరికి 1000 రూపాయలు వ్యక్తిగత పారితోషికంగా అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే తొలి అడుగు పారిశుధ్య కార్మికులతోనే పడుతుందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం పరిశుభ్రత పారిశుధ్య కార్మికుల సేవలతోనే సాధ్యపడుతుందన్నారు. పారిశుధ్య సేవలు అందకపోతే ప్రజలు అనారోగ్యపాలు కాకతప్పదన్నారు. ప్రభుత్వం పంచాయితీల ద్వారా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్ధేందుకు తీసుకున్న సంకల్పంలో కీలక పాత్ర పారిశుధ్య కార్మికులదేనన్నారు. పారిశుధ్య కార్మికుడు తాను అనారోగ్యపాలు అవుతున్నప్పటికీ లెక్క చేయక విధినిర్వహణలో అంకిత భావాన్ని కనుపరుస్తారన్నారు. అటువంటి సేవలు అందిస్తున్న కార్మికులకు ఎంత చేసిన తక్కువేనన్నారు. కరోనా కష్ట కాల తరుణంలో ప్రజలు బయటకి రావటానికే భయపడే పరిస్థితులు ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి దైర్యంగా అందించిన సేవలు ప్రజల హృదయాలను హత్తుకున్నాయని కలెక్టర్ ఢిల్లీరావు కొనియాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒక్కొక్క పారిశుధ్య కార్మికునికి అరిసెలు, చెక్కలు యాపిల్, కమల పండ్లు, సబ్బులు , కొబ్బరినూనె, పౌడర్ , గ్లౌజులు , టవల్స్ తో కూడిన కిట్టుతో పాటు 1000 రూపాయల వ్యక్తిగత నగదు పారితోషికాన్నిఅందజేశారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారిణి జె. సునీతకు సూచించారు.
జిల్లా కలెక్టర్ నుండి సన్మానం అందుకున్న ఉత్తమ పారిశుధ్య కార్మికులు :
పి. సుధాకర్ (ఎ కొండూరు ), బి. జ్యోతి (చందర్లపాడు) ఎన్. అయ్యప్ప (వెలగలేరు), ఎం. సోమయ్య (గంపలగూడెం), ఎం. వాణి (గుంటుపల్లి), ఎ లోకయ్య (గొలుసుపాడు) , సిహెచ్ ఎస్తేరమ్మ (కంచికచర్ల) , ఎం మహేశ్వరీ (మైలవరం), జె బి. నారాయణ (హైతవరం), ఏం. రాఘవులు (పెనుగంచిప్రోలు), సిహెచ్. భాస్కరారావు (రెడ్డిగూడెం), జి. ప్రసాద్ (లక్ష్మిపురం), ఎం. రంజిత్ కుమార్ (వత్సవాయి) , ఎ. శ్రీనివాసరావు (వీరులపాడు), కె. సుగుణ (గొల్లపూడి) , టి. జమలయ్య (విస్సన్నపేట) లను జిల్లా కలెక్టర్ దుస్సాలువ తో ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

-వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి -అర్బన్ ప్రాస్పెరిటీ విభాగంగా పట్టణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దాలి -పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *