-18వ వర్థంతి సభలో పౌర సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్. బాబూరావు
-ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల పక్షాన అవిరళ కృషిచేసిన కార్మిక నాయకుడు కుండనాల భాస్కరరావు అని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పౌర సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్. బాబూరావు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి అన్నారు. విద్యాధరపురం మర్రిచెట్టు సెంటర్‌లో కార్యక్రమ నిర్వాహకురాలు, ఐద్వా పశ్చిమ సిటీ అధ్యక్షురాలు కుండనాల శేషుమణి ఆధ్వర్యంలో మంగళవారం 44వ డివిజన్‌లో కుండనాల భాస్కరరావు 18వ వర్థంతి, కుండనాల అనిల్ వంశీ స్మృత్యర్థం సభ జరిగింది. తొలుతగా భాస్కరరావు, అనిల్ వంశీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పౌర సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్. బాబూరావు మాట్లాడుతూ కుండనాల భాస్కరరావు ఆర్టీసీలో పనిచేస్తూనే, కార్మిక వర్గానికి అండగా వుండేవారన్నారు. అలాగే డి.వై.ఎఫ్.ఐ. నగర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. సి.పి.ఎం. పార్టీ పక్షాన పేదల ప్రజలకు, యువతకు అనేక విధాలుగా సేవలు అందించారని తెలిపారు. ఆయన లేని లోటు సి.పి.ఎం. పార్టీకి, ప్రజా సంఘాలకు తీరనిదన్నారు. గట్టువెనుక ప్రాంతంలో నివసిస్తూ కుండనాల భాస్కరరావు నిరంతరం ప్రజల మధ్యన ఉండి వారికి సేవలు అందిచేవారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ ఆర్థిక విధానాలతో దేశం అనేక ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. ప్రధాని మోదీ పాలనలో మత ఘర్షణలు పెచ్చుమీరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకూ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, రేషన్ షాపుల ద్వారా బియ్యం తప్పితే ఏమి ఇవ్వని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి కలయికతో మన సమస్యలు సాధించుకోవాలని కోరారు. వీకు వామపక్ష పార్టీలు ఎల్లవేళలా అండగా ఉంటాయని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కుండనాల భాస్కరరావు కార్మికులకు అండగా ఉండటమే గాకుండా, సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ అందరూ కలిసేవిధంగా మంచి కార్యక్రమాలు చేపట్టేవారన్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. అలాగే ఆయన కుమారుడు అనిల్ వంశీ కుండా మృతిచెందటం బాధాకరమన్నారు. వారు లేని లోటు తీర్చేవిధంగా పశ్చిమ ఐద్వా నాయకురాలు కుండనాల శేషుమణి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. నేడు మహిళలపై లైంగికదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని, రక్షణ కోసం కరాటే వంటి వాటిల్లో శిక్షణ పొందాలని రమాదేవి కోరారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన క్లాసికల్, జానపద నృత్యాలు, కోలాట నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం పిల్లలకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు, సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి ఇ.వి. నారాయణ, నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్, ఐద్వా పశ్చిమ సిటీ కార్యదర్శి గాదె ఆదిలక్ష్మి, విక్రం లక్ష్మీ, సిసిఐ నాయకులు ప్రసాద రాజు, ఎఎల్ నారాయణ, ప్రజా నాట్యమండలి పి. అప్పన్న, గంథం అంజిబాబు, వాపడల్లి రాజు, చంటి, కొండ తదితరులు పాల్గన్నారు.
Prajavartha Online Telugu News