Breaking News

వాలంటీర్ల వ్యవస్థపై ఎందుకంత ఏడుపు, కడుపుమంట..?

-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పచ్చ మీడియాపై నిప్పులు చెరిగిన మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి, అక్రమాలను నిరోధించాలన్నదే స‌చివాల‌య వ్యవ‌స్థ ప్రధాన ధ్యేయమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదినారాయణ వీధి, గన్నాబత్తుల బాబూరావు వీధి, బసవతారకనగర్ రోడ్డు, డొంక రోడ్డులలో విస్తృతంగా పర్యటించి 286 ఇళ్లను సందర్శించారు. గతంలో పాలన అంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉండేదని.. కానీ పాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన సచివాలయాల ద్వారా సేవలన్నీ ప్రజల గుమ్మం వద్దకే వస్తున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 2వేల జనాభాకు సచివాలయం ఏర్పాటుతో పాలన మరింత సుగుమం అయిందని తెలిపారు. ఏ సంక్షేమ పథకమైనా, సమస్య ఎటువంటిదైనా వాలంటీర్లను అడిగితే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ మూడున్నరేళ్లలో ప్రజలలో బలంగా ఏర్పడిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోన్న విప్లవాత్మకమైన సేవలను దేశం మొత్తం అభినందిస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వాలంటీర్ల వ్యవస్థపై పచ్చ మీడియావి విషపు రాతలు
సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందుతున్న సేవలపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే.. తెలుగుదేశం, పచ్చ మీడియాకు ఎందుకంత ఏడుపు అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదని.. నిస్వార్థ సేవకులని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ సైతం వ్యవస్థను ప్రశంసించారని గుర్తుచేశారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంట‌ర్లో ఒక పాఠ్యాంశంగా ఈ వ్యవ‌స్థను చేర్చారని తెలియజేశారు. కోవిద్ సమయంలో బయటకు రావాలంటేనే బయపడుతున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవలందించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా టెస్టులు పెంచడం, వ్యాక్సినేషన్, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే, సత్వర చికిత్సకు చర్యలతో మన రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించడంలో వాలంటీర్లు పాత్ర అమోఘమన్నారు. అటువంటి వ్యవస్థపై పచ్చ మీడియా విషపు రాతలు రాస్తూ.. వారి సేవలను కించపరుస్తోందని మండిపడ్డారు. 2019 తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, పురపాలక ఎన్నికలలో ఎక్కడా వాలంటీర్ల జోక్యం లేదని.. కానీ పచ్చ మీడియా లేనిపోని నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు.

జన్మభూమి కమిటీల దోపిడీకి ఏకంగా జీవోనే తెచ్చిన ఘనత చంద్రబాబుది
తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల రూపంలో రాష్ట్రంలో అవినీతి వరదలై పారిందని మల్లాది విష్ణు విమర్శించారు. అవేమీ పచ్చమీడియా కంటికి కనిపించవని మండిపడ్డారు. పింఛన్ కావాలంటే రూ. 10 వేలు., ఇంటి దరఖాస్తుకు రూ. 50 వేలు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి ఇంత రేటని ఫిక్స్ చేసి.. హోటల్లో మాదిరిగా ఓ మెనూనే సిద్ధం చేశారని ఆరోపించారు. ప్రజలను జలగల్లా పీక్కుతిన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పింఛన్లు, ఇళ్ల మంజూరు హక్కులను జన్మభూమి కమిటీలకు కట్టబెడుతూ.. సెప్టెంబరు 15, 2014 న ఏకంగా జీఓ నెం 135 తీసుకొచ్చింది మర్చిపోయారా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. అదే విధంగా 2017లోనూ మరో జీవో 36 ని తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీంతో ఈ కమిటీలు చేసిన అక్రమాలు, అకృత్యాలు అన్నీ ఇన్నీ కావని.. లంచాలతో వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించాయని వ్యాఖ్యానించారు.

లోకేష్ బోగస్ యాత్రకి.. పిట్టలదొరల పబ్లిసిటీ
నారా లోకేష్ ది పాదయాత్ర కాదని.. బోగస్ యాత్ర అని మల్లాది విష్ణు విమర్శించారు. అటువంటి యాత్రకి యనమల, అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు చేస్తున్న పబ్లిసిటీ.. పిట్టల దొర కబుర్లను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలుగునాట పాదయాత్రకు ఒక గుర్గింపు తెచ్చింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మల్లాది విష్ణు చెప్పకొచ్చారు. ప్రతిపక్షనేతగా ఆయన వేసిన ప్రజాసంకల్ప యాత్ర అడుగులు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల తిరుగులేని మెజార్టీతో అధికారంలో కూర్చొబెట్టిందని తెలిపారు. కానీ అధికారంలో నుంచి ఒక్క సారిగా 23 సీట్లకు పడిపోయిన తెలుగుదేశం నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలలోకి వెళతారని ప్రశ్నించారు. ధాన్యం బకాయిలు పెట్టి వెళ్లినందుకు, రుణమాఫీ చేయలేకపోయినందుకు, ఎన్నికల ముందు వరకు పింఛన్ ఎందుకు పెంచలేకపోయారని.. ఇలా ప్రజలు అడిగే ప్రతిఒక్క ప్రశ్నకు లోకేష్ కచ్చితంగా జవాబు ఇవ్వవలసి ఉంటుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ పరిస్థితి 23 స్థానాల నుంచి సున్నాకి పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కనుక ఎవరెన్ని పొర్లు దండాలు పెట్టినా.. చంద్రబాబు ఇక ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటారని, మళ్లీ సీఎం కాలేరని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, సిడిఓ జగదీశ్వరి, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, లింగాల శ్రీనివాస్ రావు, శ్యామ్, సురేష్, గణేష్, లక్ష్మణ, త్రివేణిరెడ్డి, పుష్పలత, శ్రీను, శివన్న, జె.వి.రెడ్డి, బెజ్జం రవి, భోగాది మురళి, నాని, సువర్ణరాజు, కొర్నేల్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *