-వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలను ఎక్కువగా ప్రోత్సహించాలి
-డి ఆర్ ఓ శ్రీనివాసరావు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరములో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, డిఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, రైతు భరోసా కేంద్రాల పనితీరు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీ పై ఫెర్టిలైజర్స్ ను. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ, ధాన్యం సేకరణ, పకృతి వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు సబ్సిడీ పై సరఫరా అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కుల ,మత, వర్గ, అనే భేదం లేకుండా అన్ని వర్గాల రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందజేసేలా సంభందిత అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. కావున ప్రతి గ్రామంలోనీ రైతులు భరోసా కేంద్రం ద్వారా అన్ని రకాల సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
డి ఆర్ ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పరిధిలో రైతులకు అందుబాటులో అత్యంత దగ్గరగా తీసుకొని వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రైతు భరోసా కేంద్రం అని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సర్వీసులను వ్యవసాయ అధికారులు అందించేలా చూడాలని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించేలా చూడాలని అన్నారు.
ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ… జిల్లాలో రబీ సీజన్ ప్రారంభం అయిందని సుమారు లక్ష ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. మాండూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు. పిఎం కిసాన్ 13 వ విడతలో భాగంగా ప్రతి రైతు కూడా తన భూమి ఆధార్ తో లింక్ కానీ వాళ్లు లింక్ చేసుకోవాలని మరియు ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను నిల్వ చేసుకోవడానికి గోడౌన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే రైతులకు ఎలక్ట్రిక్ మోటర్లు, పివిసి పైపులు మరియు డీజిల్ ఇంజన్లు సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండల సభ్యులు పంట దిగుబడి, ఎరువులు గురించి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ సమీక్షలో ఉద్యాన శాఖ అధికారి హెచ్ ఓ సునీల్, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా సిరికల్చర్ అధికారి గీతారాణి, రీజినల్ అగ్రికల్చర్ సీనియర్ సైంటిస్ట్ డా. హారతి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News