తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మరో 25 ఏళ్లు వైకాపాదే అధికారం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం జరిగిన కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మాజీ జడ్పిటిసి ముప్పిడి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. మంత్రి కొట్టు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుస్తున్నారన్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతూ మరోవైపు పార్టీని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లే విధంగా కన్వీనర్లు గృహసారథులు వ్యవస్థను రూపొందించారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కన్వీనర్లు గృహ సారథులు అత్యంత కీలకమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక కన్వీనర్ వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహసారథులు పార్టీ పరంగా పనిచేయవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడిందని అన్నారు. గడపగడపకు వెళుతుంటే ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మరో 25 సంవత్సరాల పాటు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాలు కట్టి చేతులు ఎత్తేసారని విమర్శించారు. అలాంటిది కేవలం ఆరు నెలల్లో రాజధానిలో నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. అమరావతిపై అందరికీ చంద్రబాబు భ్రమలు కల్పించి మభ్య పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాపం పండి 2019లో తెలుగుదేశానికి ప్రజలతో భగవంతుడు ఘోర పరాభవం చూపించారన్నారు. దేవుడు నిర్ణయం మేరకే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒకే రకమైన తీర్పు వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భగవంతుడే నిర్ణయించాడన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి అరవై లక్షల కుటుంబాలలో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి సంతోషం కోసం సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారన్నారు. అదే చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కాకుండా ఆయన సామాజిక వర్గానికి బాగు కోసమే పని చేశారన్నారు. సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలు చేసిన విష ప్రచారానికి సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన సమాధానానికి ఆ పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిందన్నారు. దేశంలోని అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలోనూ తిరిగి చెల్లించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలోనూ ఉందని పార్లమెంటు సాక్షిగా దేశ ఆర్థిక మంత్రి ప్రకటించడంతో తెలుగుదేశం జనసేన నవనాడులు కృంగిపోయాయి అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలంతా వైకాపాకుమద్దతు పలుకుతున్నారన్నారు. దీన్ని చూసి తట్టుకోలేక తెలుగుదేశం జనసేన పార్టీలు రకరకాల కుట్రలు చేస్తున్నాయన్నారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని ఆనాడు ఎన్టీ రామారావు ను కుట్ర పన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాడన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తండ్రిని మించిన తనయుడు గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తున్నారన్నారు. నూటికి నూరు శాతం మహిళలు వైకాపాకే మద్దతుగా ఉన్నారని గడపగడపకు వెళుతుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. తాను కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని వారికోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు.
Prajavartha Online Telugu News