మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సమావేశ మందిరం నందు సోమవారం జిల్లాలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ సిబ్బంది తో నెలవారి నివేదికలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా రాబోయే ఫిబ్రవరి , మార్చి మాసాంతాలకు ప్రభుత్వము నిర్దేశించిన వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నెరవేర్చవలసిందిగా ఆదేశించినారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ విధానము ద్వారా ప్రతి వైద్య బృందము వారికి కేటాయించిన వారాలలో గ్రామాలను సందర్శించి ఉదయము పొరుగు సేవలు మరియు సాయంత్రం గ్రామంలోని పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల కు వైద్య పరీక్షలు చేసి ముందుగా ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే గుర్తించి తగిన వైద్య సహాయము, సలహాలు అందించవలసినదిగా ఆదేశించినారు. ప్రతి సచివాలయ పరిధిలోను గర్భవతులను సకాలంలో నమోదు చేసి 104 సేవల ద్వారా ప్రమాదకర లక్షణాలున్న గర్భవతులను గుర్తించి వారికి కాన్పు అయ్యే వరకు ఎస్కార్టును ఏర్పాటు చేసి సురక్షిత కాన్పును చేయించవలెను. ఎనీమియా ముక్తి భారత్ కార్యక్రమం ద్వారా కౌమార దశలో ఉన్న బడి పిల్లలను, బడి బయట పిల్లలను గుర్తించి వారిలో ఉన్న రక్తహీనత సాధారణ, మద్యస్థ, తీవ్ర స్థాయి లను నివారించుటకు ఐరన్ మాత్రలను పంపిణీ చేయవలెను. గర్భవతులను నమోదు చేసిన వెంటనే వారిలో రక్తహీనతకు, ధనుర్వాతమును నివారించుటకు తగిన వైద్య సేవలు చేయవలెను. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ను పాటించుట, గుర్తింపు పొందిన వ్యాధుల యొక్క సమాచారంను పై అధికారులకు తెలియజేసి తగిన నివారణ చర్యలు చేపట్టవలెను. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన్ కార్యక్రమం ద్వారా ప్రతినెల 9 , 10 తేదీలలో పట్టణ మరియు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపరిధిలో ఉన్న రెండవ, మూడవ త్రైమాసిక గర్భవతులను గుర్తించి తగిన వైద్య సేవలు అందించవలెను. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం మరియు జననీ సురక్ష యోజన పథకం ల ద్వారా లబ్ధిదారులను సకాలంలో నమోదు చేసి వారికి ఆర్థిక సహాయంతో పాటు పోషకాహార స్థాయిని పెంపొందించుటకు తగిన సలహాలను అందించవలెను. వైద్య రవాణా కొరకు 108 సేవలను అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పైన తల్లులకు గృహాల వద్దకు 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలను అందించవలెను. ఈనెల 30వ తేదీ నుండి గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి నెల 13 వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్ధారణ పక్షోత్సవాలను నిర్వహించవలెను. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది గృహ దర్శనములు చేసి ఇంటి వద్ద ఎవరైనా లెప్రసీ వ్యాధి లక్షణాల తో పాటు పాక్షికంగా లేదా పూర్తిగా స్పర్శ కోల్పోవడంతో రంగులో ఏదైనా మార్పు ఉన్న మచ్చలు, చర్మం దళసరిగా ఉండటం వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి తగిన వైద్య సేవలు అందించవలెను. సి ఎస్ ఎస్ ఎం, హెచ్ ఎం ఐ ఎస్, ఆర్ సి హెచ్ పోర్టల్ నందు నమోదు చేసే నివేదికలను ఒకదానితో ఒకటి సరిపోల్చుకొని సకాలంలో అందించవలెను. జిల్లాలో సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ కార్యక్రమం ద్వారా గర్భవతుల నమోదు, కనీసం నాలుగు సార్లు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు, కాన్పు తరువాత ఆరు నెలల వరకు తల్లుల సంరక్షణ, బిడ్డకు సంవత్సరం వయసు వచ్చేవరకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించవలెను. అదేవిధంగా సాన్స్ కార్యక్రమం ద్వారా ఐదు సంవత్సరముల లోపు పిల్లలలో కలిగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టవలెను. కార్యక్రమ చివరిలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ ప్రతిభా పురస్కారం పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని నీ మరియు శకటాల ప్రదర్శనలో ప్రధమ బహుమతి పొందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శకటం సందర్భంగా డాక్టర్ జి గీతాబాయి ని సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెరిమిస్ట్ట డి ఐ ఓ, డాక్టర్ సుదర్శన్ బాబు డిపిఎంఓ, డాక్టర్ వెంకట్రావు డిటిసివో, శ్రీ రామారావు డీఎంవో, దీవెనమ్మ డిపిహెచ్ఎంఓ, బి శివ సాంబి రెడ్డి ఆరోగ్య విద్య మరియు విస్తరణాధికారి, బి రాజేంద్ర కుమార మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News