మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
2010 నుంచి 2016 మధ్యకాలంలో ఆధార్ కార్డు పొందిన వారితో పాటు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ ను నవీకరణ ( అప్ డేట్) చేసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రజలకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆయన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందే అవకాశంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమఅభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ అప్ డేట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాల దరఖాస్తులు బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్, సిమ్ కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.
ఆధార్ ఆధారంగా బ్యాంక్ ఖాతా తో పాటు దాదాపు 1000 ప్రభుత్వ పథకాల నివాసితులు లబ్ధి పొందవచ్చన్నారు. ఆధార్ ఉపయోగించి మొబైల్ సిమ్ పొందడమే కాకుండా వివిధ స్కాలర్షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యం పొందవచ్చన్నారు. తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుందన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే వారు ఐటీ రిటర్న్ లను సులభంగా ఈ- వెరిఫై చేయవచ్చన్నారు కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించుకోవాలని కలెక్టర్ అన్నారు.
18 సంవత్సరాల లోపు ఆధార్ నమోదు, నవీకరణలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.పుట్టిన పిల్లలకు ఆధార్ పొందేలా ఆస్పత్రుల్లోనే చర్యలు చేపడుతున్నట్లు, అన్ని ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆధార్ ప్రక్రియ చేపట్టి వంద శాతం పూర్తికి కార్యాచరణ చేయాలన్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ అప్ డేట్ చేయడం పూర్తి ఉచితంగా 2 సార్లు అవకాశం ఉందని, విద్యాసంస్థలతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఏడాది మార్చి 31 వరకు ఆధార్ నవీకరణ ఉచితమని ఆ తర్వాత నుంచి అప్డేట్ కు తగిన రుసుము వసూలు చేస్తారని కలెక్టర్ తెలిపారు
ఆధార్ అప్ డేట్ కు సంబంధించిన ఫిర్యాదులు, ముఖ్య సమాచారం, వివరాలు కోరకు టోల్ ఫ్రీ నెంబర్ 1947, help@uidai.gov.in వెబ్ సైట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన ఆధార్ సేవా కేంద్రాల కు తగిన చర్యలు తీసుకోవాలని ఈ డిస్టిక్ మేనేజర్ వరప్రసాద్ ని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జిల్లా ఎస్పీ పి జాషువా, డి ఎల్ డి ఓ సుబ్బారావు, ఆధార్ నమోదు డిస్టిక్ కో- ఆర్డినేటర్ లక్ష్మణ్, డి ఎం హెచ్ ఓ జి.గీతాబాయ్, డీఈవో తాహెరా సుల్తానా, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News