Breaking News

పేదల ఉన్నతి సీఎం వైఎస్ జగన్ తోనే సాధ్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలందరూ ఆర్థికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, అధికారులతో కలిసి ఇందిరానాయక్ నగర్ లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. తొలుత స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. 184 గడపలను సందర్శించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇవాళ ధైర్యంగా ప్రజ‌ల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివ‌రిస్తున్నామంటే దానికి కార‌ణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనే అని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా కొత్తగా ఏర్పడుతున్న కాలనీలలో రోడ్లు, యూజీడీ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ సిబ్బందిని ఆదేశించారు.

ఇందిరానాయక్ నగర్ కు రూపాన్నిచ్చింది వైసీపీ ప్రభుత్వం
శివారు ప్రాంతమైన ఇందిరానాయక్ నగర్ కు ఒక రూపాన్ని ఇచ్చింది సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మల్లాది విష్ణు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా.. పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందన్నారు. ఇందిరానాయక్ నగర్ అభివృద్ధికి కనీసం నయా పైసా కూడా వెచ్చించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈప్రాంతానికి కొత్త కళ వచ్చిందని.. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.20 కోట్ల నిధులను డివిజన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వివరించారు. సందేహాలు ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని.. అంతేగానీ పిట్టకథలు చెప్పడం మానుకోవాలని టీడీపీ నేతలకు మల్లాది విష్ణు సూచించారు.

లోకేష్ యాత్రను చూసి జనం నవ్వుకుంటున్నారు
ప్రజాబలం లేని నారా లోకేష్ పాదయాత్రను చూసి జనం నవ్వుకుంటున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. పట్టుమని వంద మంది కూడా పాదయాత్రలో కనిపించడం లేదని.. కేవలం తన కార్యకర్తలను కాపాడుకునేందుకు టీడీపీ యాత్రను ప్రారంభించిందన్నారు. చివరకు పాదయాత్ర పలుచబడటంతో జీర్ణించుకోలేక రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని మండిపడ్డారు. నారాలోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదని, సీఎం అభ్యర్థి అంతేకంటే కాదని.. కేవలం మంగళగిరిలో ఓడిపోయిన ఒక టీడీపీ అభ్యర్థి మాత్రమేనని ఎద్దేవా చేశారు. లోకేష్ కు ఏమాత్రం అనుభవం, వయస్సు, కనీస బాధ్యత లేవని వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు పేదల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు.. నేడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు అజెండాను భుజానికి ఎత్తుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీ టీంగా వ్యవహరిస్తూ.. బాబు కనుసన్నల్లో కోర్టులకు వెళ్లడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు మెప్పుకోసం పనిచేయడం రామకృష్ణ మానుకోవాలని సూచించారు.

నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందుతుండటంతో.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, బసివిరెడ్డి, వసంత్ కుమార్, తోపుల వరలక్ష్మి, భోగాది మురళి, జాన్ బాబు, వరప్రసాద్, జలీల్ ఖాన్, ఇర్ఫాన్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *