-క్యాన్సర్‌కు కారణమయ్యే జంక్‌ఫుడ్స్‌కి దూరంగా ఉండండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్యాన్సర్ నియంత్రణకు శారీరక వ్యాయమం తప్పనిసరని వ్యాధికి కారణమైయ్యే జంక్‌ఫుడ్స్ అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణపై ప్రజలలో చైతన్యం కల్పించేందుకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని మంగళవారం గురునానక్ సమీపంలోని ఏపిఐఐసి కాలనీలో గల అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్దజిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. గతంలో 50 నుండి 60 సంవత్సరాలు పైబడిన వారిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడేవన్నారు. ప్రజలలో నానాటికి తగ్గుతున్న వ్యాధినిరోదక శక్తి కారణంగా అధిక శాతం మంది క్యాన్సర్ వ్యాధికి గురి అవుతున్నారన్నారు. ముఖ్యంగా విపరీతమైన మానసిక శారీరక ఒత్తిడిలతో పాటు ఆహారపు అలవాట్లు క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయన్నారు. అనారోగ్యానికి కారణమైన జంక్ ఫుడ్స్‌లో చక్కెర, ఉప్పు కొవ్వు పదార్థాలు అధిక క్యాలరీస్ వివిధ హర్మోన్లుపై ప్రభావం చూపి క్యాన్సర్ వ్యాధికి కారణమైయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. జంక్‌పుడ్స్ వాడకం అనారోగ్యమని తెలిసి కూడా ప్రజలు వాటిపై మక్కువ చూపుతున్నారన్నారు. జంక్‌ఫుడ్స్ ఆహారపు అలవాట్లను మానుకోవాలన్నారు. ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, సైకిలింగ్, యోగా వంటి వ్యాయామాలను ఆచరించిన్నట్లయితే వ్యాధి దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించిన్నట్లయితే తొలి దశలోనే వ్యాధిని గుర్తించి నివారించేందుకు చర్యలు తీసుకోవాచ్చునన్నారు. క్యాన్సర్ వ్యాధి గతంలో రేడియేషన్ ట్రీట్‌మెంట్ అందించవలసి వచ్చేదని ప్రస్తుతం మందుల ద్వారా వ్యాధిని నివారించే అవకాశాలు ఉన్నాయన్నారు. పొగాకు ఉత్పత్తులు మద్యం సేవించడం వంటి దురాలవాట్ల వలన ఊపిరితిత్తులు రొమ్ము, నోరు, ఉదరకోశం, కాలేయం, గర్భాశయ ముఖదారంలో క్యాన్సర్ వ్యాధి ఏర్పాడుతుందన్నారు. సంబంధిత అవయవాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైన తక్షణమే పరిక్షలు నిర్వహించుకుని వ్యాధి నిర్థరణ చేసుకోవాలన్నారు. చిరుదాన్యలు, పప్పుదినుసులు, కూరగాయలు, ఆకుకూరలు వంటి పౌష్టికాహారన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుని పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడం ద్వారా 70 శాతం మంది క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స పొందుతున్నారన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహాలను తొలగించి మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం వుందన్నారు. మహిళలు తరచు శారీరక చికిత్సలను చేయించుకోవడం ద్వారా వ్యాధులను గుర్తించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్సర్ వ్యాధికి చికిత్సను అందించేందుకు ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందన్నారు.
తొలుత క్యాన్సర్ వ్యాధి నివారణపై ప్రచార వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ డిల్లీరావు విడుదల చేసి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, అమెరికన్ అంకాలజీ ఇన్శిట్యూట్ డైరెక్టర్ డా. ఎస్ సుబ్బారావు, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఇండియన్ రైడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షులు డా. జి. సమరం, డా. వైయస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. సుమన్, డిప్యూటి డియంహెచ్‌వో డా. ఉషారాణి, డిఐవో డా. అమృత, ఎన్‌సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. మాధవి, డిపియంవో డా. నవీన్, స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. కిరణ్, డా. సుబ్బామణ్యం ఎసిపి ఖదార్‌బాష, పటమట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News