-కిడ్నీ సంబంధిత ఆనారోగ్య సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించాలి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ముఖ్యమైన భాగమని వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కిడ్నీ సంబంధిత ఆనారోగ్య సమస్యలను ప్రాధమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
అంతార్జాతీయ కిడ్నీ దినోత్సవ సందర్భంగా నగరంలోని సిద్దార్థ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మూత్రపిండాల ప్రాముఖ్యతను, మూత్రపిండ సంబంధిత ఆనారోగ్య సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి నెల రెండవ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జీవి మనుగడకు మెదడు, గుండె, మూత్రపిండాలు మూలాదారాలన్నారు. శరీరంలో మెదడు జీవికి సంబంధించిన కార్యకలాపాలను నియంత్రిస్తే గుండె శరీరంలోని నాలుగు మూలాలకి రక్తాన్ని ప్రసరింపచేస్తుందన్నారు. రక్తంలో చేరిన కల్మషాన్ని వెతికి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలదన్నారు. ఒక రోజులో మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడపోసి శరీరంలో నీరు, లవణాల సమతౌల్యం దెబ్బతినకుండా చేయడంతోపాటు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపుతాయని, అలా బయటకు పంపిన నీరే మూత్రంగా విసర్జించడం జరుగుతుందన్నారు. రక్తపోటును నివారించడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర వహిస్తాయన్నారు. మనం తినే ఆహారం జీర్ణమై రక్త ప్రసరణలో కలిసినప్పుడు కొన్ని మలిన పద్దార్థాలు రక్తంలో చేరతాయన్నారు. వాటిని మూత్రపిండాలు సత్వరం శరీరం నుండి బహిష్కరించకపోతే రక్తం విషపూరితమవుతుందన్నారు. రక్తంలో ఉన్న సోడియం, పోటాషియం, బాస్వరం మొదలైనవి సమతౌల్యంలో రక్తంలో ఉంచి మిగిలిన వాటిని బయటకు పంపడంలో మూత్రపిండాలలో ఉన్న గ్లోమెరూల్సు, చిట్టిగొట్టాలూ పని చేస్తాయన్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల కిడ్నీలను ఆరోగ్యవంతంగా ఉండేలా సమరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. మూత్రపిండాలు దెబ్బతింటే అవి వాటి ధర్మాన్ని నిర్వర్తించలేవని అటువంటప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం వుంటుందన్నారు. సహజంగా అధిక రక్తపోటు, మధుమోహం వంటి దీర్ఘకాల వ్యాధులు ఊబకాయం, మద్యపానం, ధూమపానం, మత్తుపదార్ధాల సేవించడం కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. కిడ్నీలు దెబ్బతిన్నాయనే దానికి తరచు కాళ్ళు వాపులు వచ్చి తగ్గడం, కండరాల నొప్పులు, శరీరంలో నీరు చేరడం, ఆకలి మందగించడం వంటివి ప్రాధమిక లక్షణాలు గుర్తించి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా సంరక్షించుకోవాలన్నారు. తగినంత సురక్షతమైన నీరు త్రాగడం, మానశిక ప్రశాంతత, యోగా, ధ్యానం శారీరక వ్యాయమం, పౌషికాహారం తీసుకోవడం వంటి అలవాట్లను ఆచరించాలన్నారు. మితిమీరిన డైట్ కంట్రోల్ కిడ్నీలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజలకు వివరించి కిడ్నీ సంబంధిత ఆనారోగ్య సమస్యలకు గురి కాకుండా చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు డా.వి. వినోద్‌కుమార్ మాట్లాడుతూ ధ్రవాల సమతుల్యానికి విషపద్దార్థాలను తొలగించేందుకు, రక్తాన్ని వడకొట్టి మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు, అధిక రక్తపొటు నివారణకు మానవ శరీరంలోని కిడ్నీలు ఎంతో దోహదపడతాయన్నారు. కిడ్నీలు దెబ్బతింటే మానవ ఆరోగ్య మనుగడకే ప్రమాదం అన్నారు. కిడ్నీలు ఆరోగ్య సంరక్షణ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో సిద్దార్థ వైద్య కళాశాల పిన్సిపాల్ డా. కె. సుధాకర్, హెచ్‌వోడి పి వెంకట కృష్ణ, ఆర్‌యంవో డా. శోభారాణి, నెప్రాలజీ విభాగానికి చెందిన డా. సిహెచ్ నాగేశ్వరరావు, డా. విజేష్‌వర్మ, వైద్య కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News