-ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షలు, జిల్లాలో హాజరు కానున్న 28412 విద్యార్థులు
-మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లో అనుమతి లేదు: కలెక్టర్
-పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు ప్రణాళిక సిద్ధం: ఎస్పీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి అమరావతి నుండి వర్చువల్ విధానంలో శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయగా, తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తో కలసి కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని అందులో జిల్లాలో 58750 విద్యార్థులు హాజరు కానున్నారని, ఏప్రిల్ 3నుండి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని అందులో 28412 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణ పగడ్బందీగా జరపాలని ప్రాంతీయ ఇంటర్మీడియేట్ అధికారి, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణ ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు ఉంటుందని 9 గం. దాటిన తర్వాత విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని, జిల్లా కేంద్రంలోని ఆర్ ఐ ఓ కార్యాలయంలో జిల్లా ఇంటర్మీడియట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాలని అన్నారు.
పదవ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటుందనీ, 9.30 గం.లు దాటిన తర్వాత విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు, ఉదయం పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సుల సౌకర్యం, పరీక్షా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖలు చూడాలని అన్నారు.
ఎండల దృష్ట్యా త్రాగునీరు, వైద్య ఆరోగ్య శాఖ వారు మెడికల్ కిట్, ఓ ఆర్ ఎస్ స్యాచెట్ లు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ హెచ్ ఓ లు పోలీస్ స్టేషన్ నందు ప్రశ్నాపత్రాలు భద్రత చూడాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, తగినన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటు ఉండాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లు వైద్య సిబ్బంది తో సహా ఎవరికి కూడా మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని పోలీసు సిబ్బంది అధికారులు ముందుగా చెకింగ్ చేయాలని సూచించారు. తగినంత మంది పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీసులను పరీక్షల విధులకు నియమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ రమేష్, డి.ఇ.ఓ. శేఖర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News