-అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, మునగ చెట్ల పెంపకాన్ని చేపట్టండి.
-సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలను వినియోగించండి.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలను వినియోగించి మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, మునగ చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు మహిళ శిశు సంక్షేమ అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార వినియోగంపై శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మహిళ శిశు సంక్షేమ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫెరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1475 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 93 వేల మంది చిన్నారులకు, 8,700 మంది గర్భిణీలకు, 10,300 మంది బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. చిన్నారులు, కిశోర బాలికలు, మహిళలలో రక్త హీనతను నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, మునగ చెట్ల పెంపకం ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 శాతం అంగన్వాడీలలో కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్ లను ఏర్పాటు చేసేందుకు స్థల సమస్య ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి వాటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో కిచెన్ గార్డెన్ లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆకుకూరలను పండించేందుకు అంగన్వాడీ కేంద్రాలలో ప్లాస్టిక్ డబ్బాలను, తొట్టెలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పప్పుకూరలు, మునగ పౌడర్ ను వినియోగించాలని సేంద్రీయ ఎరువులతో తయారైన ఆకుకూరలు, కూరగాయలను వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు ఏపీ కమ్యూనిటీ ఆధారిత సహజ వ్యవసాయ అధికారి సహకారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించేందుకు సూచించిన రోజువారీ మెను తప్పక అమలు చేయాలన్నారు. రక్తహీనత నివారించేందుకు సరఫరా చేస్తున్న ఐరన్ టాబ్లెట్ లను తప్పక వినియోగించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు.
టెలీకాన్ఫెరెన్స్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. ఉమాదేవి, సీడీపీవో లు మంగమ్మ, టి. నాగమణి, భాగ్యరేఖ, లక్ష్మి భార్గవి, లలిత, కె. పుష్పలత, సత్యవతి, అంగన్వాడీ సూపర్ వైజర్ లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News