-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా పెరుగుతున్న కాలేయ, మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యం చేకూరేలా వైద్యులు నాణ్యమైన సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు అన్నారు. మారుతీ నగర్ లో ఆర్యన్ రెనల్ కేర్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. అయితే కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రమే అందరికీ ఆరోగ్యాన్ని అందించడం సాధ్యం కాదని చెప్పారు. సమాజంలో పేద వర్గాల వారికి వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. సాధారణ స్థాయి వ్యక్తులకు కూడా అత్యంత అధునాతనమైనవైద్య సేవలు అందిచేందుకు ఇటీవల కాలంలో యువతరం వైద్యులు ముందుకు రావడం శుభ పరిణామం అని నిర్వాహకులను అభినందించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న ప్రాథమిక వైద్య కేంద్రాలు అందిస్తున్న సేవలను వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులందరూ సహకరించాలని కోరారు. ఆసుపత్రి నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ పోతుల పవన్ సాయి మాట్లాడుతూ తాను ఇదే ప్రాంతంలో జన్మించడం, విద్యాభ్యాసం కూడా ఇదే ప్రాంతంలో జరిగిందని తెలిపారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రులలో సేవలందించేందుకు తనకు అవకాశాలు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలోని ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆసుపత్రిని మారుతి నగర్ లో స్థాపించినట్లు వివరించారు. దేవదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు సత్వరమే వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు, 108 వాహనాల ద్వారా కృషి చేస్తోందని వివరించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చాగంటి సింధు, స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి తదితరులతోపాటు పలువురు వైద్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News