కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత మరోసారి తమ మానవత్వం చాటుకున్నారు. హోం మంత్రి సోమవారం షెడ్యూల్ ప్రకారం తమ క్యాంపు కార్యాలయంలో నుండి కాన్వాయ్ లో బయలుదేరారు. ఇంతలో మంత్రిని కలవడానికి ఒక ఆటో ఎదురుగా క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉంది. ఇంతలో హోంమంత్రి ఆటోలో ఉన్న దివ్యాంగుడిని చూసి.. వెంటనే తమ వాహనం నుంచి క్రిందకు దిగి ఆటో వైపు నడుచుకుంటూ ఆ దివ్యాంగుని దగ్గరకు వెళ్లి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ దివ్యాంగునికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించడంతో పాటు మెరుగైన ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు టౌన్ పరిధిలోని ఆవులవారి వీధికి చెందిన కొమ్మి సాంబ శివ కుమార్ s/o వెంకట రత్నం (లేటు) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మొత్తం అతనే చూసుకునేవాడు. గత సంవత్సరం భవన నిర్మాణ పనుల్లో ఉండగా నాలుగో అంతస్తు నుండి కిందికి పడిపోవడంతో వెన్నుముకకు బలమైన గాయం కావడంతో కాళ్లు రెండు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తనపైనే ఆధారపడిన తల్లిని, తనను ఆదుకోవాలని పెన్షన్ పెంపు కోసం విన్నవించుకోవడానికి తల్లి సాయంతో సాంబ శివ కుమార్ హోంమంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితిని చూసి చలించిన మంత్రి అతనికి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారులను పిలిచి నిబంధనలకు అనుగుణంగా మెరుగైన వైద్య సాయంతో పాటు పెన్షన్ పెంపు వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. మంత్రి బీజీ షెడ్యూల్ లో కూడా తమ కోసం ఆగి మరీ స్వయంగా ఆమె తమ వద్దకు వచ్చి సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల ఆమె తల్లి ఆనందం వ్యక్తం చేసింది. నిజంగా మంత్రి గొప్ప మానవతావాది అని క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు అనుకుంటున్నారు.
Prajavartha Online Telugu News