– సి.ఆర్. మీడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుగా పనిచేసి, విశ్రాంత జీవనం గడుపుతున్న సీనియర్ జర్నలిస్టులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి ఇంటికే వెళ్లి గౌరవిస్తున్నామని సి.ఆర్. మీడియా అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఎన్.టి.ఆర్ జిల్లా ” కాసరనేని వారి పాలెం” గ్రామంలో వారి స్వగృహంలో ఆ గ్రామ సర్పంచ్ పెద్దు వరప్రసాద్ తో కలిసి మంగళవారం ఉపేంద్ర బాబు ను సి.ఆర్. మీడియా అకాడెమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు , సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి కాలం జర్నలిజం విలువలు నేటి తరానికి స్ఫూర్తి నివ్వాలని, అందుకు సీనియర్ పాత్రికేయల్ని గౌరవించడం సంప్రదాయంగా మీడియా అకాడెమి చైర్మన్ గా తాము ప్రారంభించి కొనసాగిస్తున్నామని కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. గారపాటి ఉపేంద్ర బాబు, పద్మ దంపతులను రాష్ట్ర ప్రభుత్వం తరపున శాలువా తో సత్కరించి, మెమెంటో ను చైర్మన్ అందచేశారు. జర్నలిజం రంగంలో సుదీర్ఘ కాలం పని చేసి తమ స్వగ్రామం లో కాలం గడుపుతూన్న తమను రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడెమి ద్వారా గుర్తించి, గౌరవించినందుకు వెటరన్ జర్నలిస్టు గారపాటి ఉపేంద్ర బాబు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పత్రికా రంగానికి తాము సేవలందించిన అనుభవాలను ఉపేద్ర బాబు చైర్మన్ తో పంచుకున్నారు. చాలా కాలంగా సమాజానికి దూరంగా కాలం వెళ్లదీస్తూన్నతమ వద్దకు మీడియా అకాడమి చైర్మన్ రావడం, తమను గౌరవించడం, పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రంలో సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధర తిలక్, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News