Breaking News

యోగా ద్వారా మానసిక ఒత్తిడి దూరం..

-ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభోత్సవంలో ఎన్. టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్య జీవితంలో యోగాసనాలకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవడం, యోగాసనాలు వేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ప్రతీ ఒక్కరూ దృఢంగా తయారవుతారని ఎన్. టి. ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. అమరావతి యోగా & ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేసవి ఉచిత యోగ శిక్షణా శిబిరాన్ని ఆదివారం ఐ.జి.ఎం.సి. స్టేడియం లోని యోగా హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల శరీరంలోని అష్టాంగాలు చైతన్యవంతంగా తయారవుతాయని తెలిపారు. ప్రధానంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి అనివార్యంగా మారిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాధులు కూడా చాలా తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయన్నారు. కానీ శరీరంలోని ఒత్తిడిని అధిగమించేందుకు పురాతన కాలంలోనే మన పూర్వీకులు యోగా అభ్యసన చేయడం ద్వారా ఎటువంటి వ్యాధులు లేకుండా సంపూర్ణ ఆయుష్ తో జీవించారని గుర్తు చేశారు. ముఖ్యంగా యోగాసనాల ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, మానసిక స్థితప్రజ్ఞత వంటి లక్షణాలు చాలా సులువుగా మనసును స్థిరమైన ఆలోచన వైపుగా నడిపిస్తాయన్నారు. జిల్లాలోని 257 ఆరోగ్య కేంద్రాల్లో కూడా వివిధ రకాల వైద్య విధానాలతో పాటు యోగాసనాలు కూడా ఒక అంశంగా చేర్చామని పేర్కొన్నారు. ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలలో సైతం యోగాసనాలను సర్వరోగ నివారిణిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. 2000 సంవత్సరాల క్రితమే మనదేశంలో ఋషులు యోగాసనాలు, ధ్యానం ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేశారని చరిత్ర చెబుతోందన్నారు. ఇటువంటి శిక్షణా శిబిరాలకు ప్రభుత్వం నుంచి వీలైనంతవరకు సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసోసియేషన్ కార్యాలయంలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం లేదని, నూతనంగా కార్యాలయం నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి డి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తాము పరిమిత స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఈ తరహా శిబిరాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న ఎంతోమంది అధికారులు, పారిశ్రామికవేత్తలు యోగాసనాలు అభ్యసిస్తున్నారని వివరించారు. తాను ఎన్నో రాష్ట్రాలలో వ్యాపార పరంగా పర్యటించిన సమయంలో తనకు పరిచయమైన ఎంతోమంది వ్యక్తులు యోగాసనాల ద్వారానే క్రమశిక్షణ, సమయపాలన, మానసిక స్థిరత్వంతో జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించామని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా లీగ్ చీఫ్ కోఆర్డినేటర్ జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగాసనాలకు ఉన్న ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం భారతదేశానికి గర్వకారణమన్నారు. ఇటువంటి ఉచిత శిక్షణా శిబిరాలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అసోసియేషన్ నిర్వాహకులు పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, యోగాసనాల పట్ల ఆసక్తి కలిగిన పలువురు యువతీ యువకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *