విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులకు గురువారం కళాశాల సమావేశ హాల్ నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్‌కుమార్, సాంకేతిక విద్య డైరెక్టర్ సి.నాగరాణిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది చదువు పూర్తి చేసుకున్న వివిధ విభాగాలలోని 277 మంది అభ్యర్థులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. చదువుకున్న విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా త్వరితగతిన ఉద్యోగ పొందే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయన్నారు. అయితే ఆయా పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు లభ్యం కావడంలేదన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి పాలిటెక్నిక్ చదువుకున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చాలా కంపెనీలు పాలిటెక్నిక్ అర్హత ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆయా కంపెనీలకు అవసరమైయ్యే నైపుణ్య శిక్షణను అందించి వినియోగించుకుంటున్నారన్నారు. తక్షణమే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. ప్లెస్‌మెంట్ అందించే కంపెనీలలో అభ్యర్థులకు అన్‌లైన్ ద్వారా బి టెక్ చదువుకునే అవకాశాలు కల్పించాయన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌కు బంగారు భాట వేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ విద్యార్థులను కోరారు.సాంకేతి విద్య డైరెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ చివరి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులకు ప్లెస్‌మెంట్ రావడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పించాయన్నారు. పాలిటెక్నిక్ విద్యలో బాలికలు ఎక్కువ మంది చదువుకునేలా పోత్సహించాలన్నారు.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగాలలోనే కాకుండా అవకాశాలు ఎక్కువగా ఉండే మెకానికల్, సివిల్ విభాగాలలో ఎక్కువ మంది చదువుకునేలా ప్రోత్సహించాలని సాంకేతి విద్య డైరెక్టర్ నాగరాణి అన్నారు.కార్యక్రమంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెట్రోలాజి విభాగాలలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ ఆర్డర్ పత్రాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్‌కుమార్, సాంకేతిక విద్య డైరెక్టర్ సి.నాగరాణిలు అందజేశారు.కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.యం విజయభాస్కర్, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ డా. పివి రమేష్‌కుమార్, ఎస్‌బిటిఇటి సెక్రటరీ రమణబాబు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రామకృష్ణ, డిప్యూటి డైరెక్టర్ విజయభాస్కర్, కళాశాల విద్యార్థులు ఉన్నారు.
Prajavartha Online Telugu News