విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తొలకరికి ముందుగానే రైతులు నవధాన్యాల పంటలను చేపట్టి నేలతల్లి ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయంలో ఆశించిన ఫలితాలను సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం (ఏపిసిఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో రైతులకు నవధాన్యాల పంటల ద్వారా ప్రకృతి సాగు పై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అవసరాలకు మించి రసాయనిక ఎరువులు వినియోగించడంతో భూములలో సారం దెబ్బతిని చౌడు భూములుగా మారుతున్నాయన్నారు. తొలకరికి ముందుగానే నవధాన్యాల పంటలను చేపట్టి తద్వారా భూమిని సారవంతం చేసుకునేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. భూమి సారవంతమైతేనే రైతులకు ఆశించిన దిగుబడులు లభిస్తాయన్నారు. భూములను సారవంతంగా మార్చుకునేందుకు రుతుపవనాలకు ముందుగా నవధాన్యాల పంటలను నాటడం వలన భూమిలో సారవంతమైన పొర రక్షించబడుతుందన్నారు. ముందుస్తు సేద్యంలో భాగంగా ఘనజీవామృతం వినియోగించడం వలన భూమికి మేలు చేసే సూక్ష్మ జీవులకు ఆహారం లభించి అవి ఇబ్బడి బ్బుడిగా వృద్ధి చెందుతాయన్నారు. సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందడం ద్వారా పోషకాలను మొక్కల వేర్లకు అందుబాటులో తీసుకువస్తాయన్నారు. తృణధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, వెదచల్లి పంటలను చేపట్టి సూక్ష్మ జీవుల అభివృద్ది చేసుకునేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. సేద్య సన్నద్ద పంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, పెసలు, శనగలు, మినువులు, నువ్వులు, ఆవాలు, జీలుగ, కట్టె జనుము, పిల్లిపెసర, బెండ, గోరుచిక్కుడు తదితర పంటలను చేపట్టడం వలన నేల కోతను అరికట్టుకోవడం జీవ వైవిద్యం పెరగడం, సూక్ష్మ జీవుల అభివృద్ధి, వర్షపు నీరు భూములలో ఇంకడం, భూతాపం తగ్గడంతో పాటు పశుగ్రాసానికి ఎంతో దోహదపడతాయని రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయ విత్తన శుది విత్తన గురికలు తయారి ఉపయోగాలు ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఆచ్ఛాదన, పంటల వైవిధ్యం వంటి విషయాలలో రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.వాల్ పోస్టర్ విడుదలలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగమణెమ్మ, ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్‌రావు, ఏపిసిఎస్‌ఎఫ్ డిపియం విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News