-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్రంలో యూడైస్ ప్రకారం దాదాపు 92 వేలమంది ప్రత్యేక అవసరాల గల పిల్లలు పాఠశాలల్లో నమోదై ఉన్నారు కానీ సర్వే చేస్తే మరో 2 లక్షల వరకూ ఉండొచ్చని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ రూపొందించింన ‘ప్రశస్త్ యాప్’ పై ఒక రోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 26 జిల్లాల ఐఈ (ఇన్ క్లూజీవ్ ఎడ్యుకేషన్) కోఆర్డినేటర్లు, జిల్లాకు ఒకరు చొప్పున స్పెషల్ ఎడ్యుకేటర్ (స్కూల్ అసిస్టెంట్) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించడానికి 21 వైకల్యాలను ప్రస్తావిస్తూ ‘ ‘ప్రశస్త్’ యాప్ రూపొందించారని, ‘పార్ట్ ఎ’లో తరగతి ఉపాధ్యాయులు 63 ప్రశ్నల ద్వారా విద్యార్థుల ప్రవర్తన ఆధారంగా గుర్తించాలని, ‘పార్ట్ బి’లో మరిన్ని భిన్న ప్రవర్తనలు కలిగిన విద్యార్థులను స్పెషల్ ఎడ్యుకేటర్లు గుర్తించాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని సర్వే ప్రారంభించాలన్నారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలను గుర్తించేటప్పుడు పిల్లల మనోభావాలు దెబ్బతినకుండా శ్రద్ధ చూపుతూ గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ‘నిరామయ హెల్త్ ఇన్స్యూరెన్స్’
మేధోపరమైన వైకల్యం, సెరబ్రలీ పాలసీ, ఆటిజం, మల్టీపుల్ డిజబుల్ ఈ నాలుగు వైకల్యాలు గల పిల్లలకు ‘నిరామయ హెల్త్ ఇన్స్యూరెన్స్’ పాలసీ కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. జిల్లాల్లో సమగ్ర శిక్షా కార్యాలయాల్లో, మండలాల్లోని భవిత కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రత్యేక అవసరాల గల పిల్లలను నిర్థారించడంలో ఉపాధ్యాయులు కీలక బాధ్యత వహించాలని సహిత విద్య ఏడీ ఎన్.కె. అన్నపూర్ణ అన్నారు. సత్యసాయి, విజయనగరం, ఎన్టీఆర్ లో జిల్లాలో గుర్తింపు విషయంలో ముందంజలో ఉన్నారని, మిగతా జిల్లాల్లో కూడా ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కె.ప్రవీణ్ (సీఆర్సీ) ప్రశస్త్ యాప్ డౌన్లోడ్, వినియోగం, అప్ డేట్ చేసే విధానం వంటి విషయాలపై వివరించారు.
Prajavartha Online Telugu News