-చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది : ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు
-మే 31వ తేదీ లోపు పిఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేయాలి : జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరములో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఆధర్వంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీ పై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా, ప్రకృతి వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, టార్ఫలిస్స్ సబ్సిడీ పై సరఫరా అంశాలపై విశదంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలు లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు వారికి చేరువ అయ్యేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు అని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ… జిల్లాలో ఖరీఫ్ 2023 సీజన్ గాను ఆర్ బి కే ద్వారా సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈనెల 31వ తేదీ లోపల తమ భూమిని ఆధార్ తో లింక్ చేసుకొని పీఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అన్నారు. కౌలు రైతు కార్డులు పొందుటకు రెవెన్యూ శాఖ వారు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రెండో దశలో 148 ఆర్బికేలలో కస్టమర్ హైరింగ్ సెంటర్లో రైతు గ్రూపులు ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు సరఫరా చేయడం జరిగిందని వారికి రావాల్సిన సబ్సిడీ కొరకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను నిల్వ చేసుకోవడానికి గోడౌన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే రైతులకు ఎలక్ట్రిక్ మోటర్లు, పివిసి పైపులు మరియు డీజిల్ ఇంజన్లు సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 30 మంది రైతులకు భూసార పరీక్షలపై రైతులకు అవగాహన పెంఛాలని తెలిపారు. 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణపై టి.టి.డి బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా సిరికల్చర్ అధికారి గీతారాణి, మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మండలి సీనియర్ సైంటిస్ట్ సునీత, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News