-సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పునాది దశనుంచే పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలలో సామర్థ్యాలను మెరుగుపరచి వారిలో ఆలోచనాత్మక, సృజనాత్మక కృత్యాలను నేర్పించడం ద్వారా ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దవచ్చని, దీనికి ఉపాధ్యాయులు బాధ్యతగా భావించాలని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య అన్నారు. విజయవాడ(నిడమానూరు)లోని ఆరు రోజులపాటు పునాది అభ్యాస శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణా నైపుణ్యాలను అందించాలని, తద్వారా పిల్లల్లో అభ్యసనాంతరాలను తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు.
అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నూతన విద్యా విధానాని అమలుపరచుటలో అగ్ర స్థానంలో ఉందన్నారు. వై యస్ ఆర్ ఫౌండేషన్ పాఠశాలను ఏర్పాటు చేసి వాటితో అంగన్వాడి కేంద్రాలను మిళితం చేసి, పునాది విద్యను బలోపేతం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యకు వేలకోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకొని జిల్లా స్థాయి లో మెరుగైన శిక్షణను ఉపాధ్యాయులందరికి అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రథమ్ సంస్థ నుంచి సెంట్రల్ కంటెంట్ హెడ్, లీల పద్మలత మాట్లాడుతూ, పాఠశాల విద్య ఇంటినుంచే ప్రారంభమవుతుందని, తల్లి ఆది గురువుగా అవతరిస్తుందన్నారు. నేషనల్ పవర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సునీతా మాట్లాడుతూ పాఠశాలలో చేరక ముందే ఎన్నో సామర్థ్యాలను సహజంగానే కలిగి ఉంటారని, వివిధ కృత్యాల ద్వారా ఆ సామర్థ్యాలను వెలికి తీయడం ద్వారా పిల్లలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రథమ్ సంస్థకు చెందిన స్టేట్ కంటెంట్ హెడ్ సురేష్ మాట్లాడుతూ, సంసిద్దత 1,2 లను, 4 సంవత్సరాల వయస్సులో సాధించవచ్చన్నారు. 1, 2 వ తరగతి చదువుతున్న 34 వేల మంది పిల్లలకు అలాగే 55 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఉపకరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లో ఆంధ్ర మహిళా సభ నిర్వాహకురాలు కమల, స్టేట్ అకడమిక్ మనిటరింగ్ ఆఫీసర్ విజయ భాస్కర్, కార్యక్రమ కోఆర్డినేటర్ రమామణి, 13 జిల్లాలనుంచి 156 మంది కె ఆర్ పి లు(కీ రిసోర్సు పర్సన్లు), డైట్ అధ్యాపకులు, ఎస్సీఈఆర్టీ, సీమాట్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News