-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా నూతన కార్డుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30 డివిజన్ రామకృష్ణాపురంలో సోమవారం జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి నూతన కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో రేషన్ కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. ప్రతి 6 నెలలకోసారి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సెంట్రల్లో 1,142 మంది అర్హులను గుర్తించి.. నూతన కార్డులు మంజూరు చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఈ కుటుంబాలకు సెప్టెంబర్ మాసం నుంచి ప్రభుత్వ రేషన్ అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే కార్డులను సద్వినియోగపరచుకుని పిల్లల చదువులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నూతన కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఓ-2 ధనుంజేయరెడ్డి., ఆర్ఐలు భగీరథ, వెంకటేశ్వర్లు, వీఆర్ఓలు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News