Breaking News

సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు.
-64 వ డివిజన్ 282 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ 282 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 300 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి., బుక్ లెట్లను అందజేశారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గతంలో మాదిరిగా పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. లంచాలు లేని సమాజాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నాలుగేళ్ల కాలంలో ప్రజలు ఎంతో నమ్మకంఏర్పరచుకున్నారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

డివిజన్ లో రూ. 12 కోట్ల మేర అభివృద్ధి
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాలుగేళ్లలో డివిజన్లో రూ. 12.33 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. కండ్రిక గ్రామం నుంచి ఎన్.ఎస్.సి.బోస్ నగర్ వరకు రూ.3.30 కోట్ల DMFT ఫండ్ తో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవగా.. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ. 2.70 కోట్ల DMFT ఫండ్ తో ఉడాకాలనీ నుంచి కండ్రిక వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి టెండర్లను పిలవనున్నట్లు వెల్లడించారు. రూ. కోటి నిధులతో కండ్రిక డీపీ స్టేషన్ నుంచి ఉడాకాలనీ జంక్షన్ వరకు డ్రెయిన్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. రూ. 15.35 లక్షలతో నూతన శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో రూ. 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు తెలియజేశారు. అదే విధంగా 4 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా విడుదలైన రూ. 80 లక్షల నిధులతో అనేక రోడ్లకు మోక్షం లభించిందన్నారు.

అవినీతిపరులకు విపక్షాల మద్ధతా..?
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రజాధనం దోపిడీ చేసిన పాపం చంద్రబాబును వెంటాడుతోందని మల్లాది విష్ణు అన్నారు. స్కిల్ స్కాంను జీఎస్టీ అధికారులు గుర్తిస్తే.. సీఐడీ అధికారులు సుధీర్ఘ విచారణ చేపట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని.. అటువంటి ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణ.. చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. మరీముఖ్యంగా సీపీఐ రామకృష్ణ.. మోదీ జపం చేస్తున్న చంద్రబాబును భుజానికెత్తుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ అవినీతిపరులను గతంలో జనసేన అధినేత మాట్లాడలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. మరలా ఏ ముఖం పెట్టుకుని జైలుకెళ్లి బాబుతో ములాఖత్ అవుతున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారికి.. మద్దతు తెలిపే విపక్షాలు ఉండటం దౌర్భాగ్యమని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరితే.. సీఎం జగన్ ప్రభుత్వంలో పేదరికం 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గిందని మల్లాది విష్ణు అన్నారు. కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకులెవరో ప్రజలకు తెలుసని.. అందుకే కుంభకోణాల్లో ఇరుక్కుని జైలుకెళ్లిన చంద్రబాబుకు మద్దతుగా ఎవరూ రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి లేదన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, సీఆర్డీఏ, రాజధాని నిర్మాణం, ఏపీ సచివాలయ భవన నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కూడా విచారణ చేపడితే బాబు అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు యరగొర్ల రాములు, ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, పందిరి వాసు, మేడా రమేష్, మాతా మహేష్, వెంకటేశ్వరమ్మ, విమల, తాండవ కోటి, కిరణ్, కృప, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *