తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం – 2024 మేరకు ఇంటింటి ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీల నుండి అందిన పిర్యాదులు పూర్తిస్థాయిలో పరిశీలనలు చేపట్టి మార్పులు, చేర్పులకు రికార్డులు సిద్దంగా ఉంచామని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వివరించారు.
మంగళవారం ఉదయం ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం – 2024 పై రాజకీయ పార్టీలు సమర్పించిన క్లెయిమ్‌లు & అభ్యంతరాలు, అనోమలిస్, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డ్ జనరేషన్, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్ హరిత , ఇ ఆర్ ఓ లు, ఎఇ ఆర్ ఓ లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి 52,327 ఫిర్యాదులు అందాయని , 6.01.2022 నుంచి 09.08.2023 వరకు 1,10,451 ఓటర్ల ను పునఃపరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో డూప్లికేట్ ఓటర్లు 1858, సిఫ్టేడ్ ఓటర్లు 4854, డెడ్ ఓటర్లు 12,709, అందుబాటులో లేనివి 5528 గుర్తించి ఇ ఆర్ ఓ నెట్ నందు అప్ డేట్ చేసామని, ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ముసాయిదా ఓటర్ల జాబితా లో అప్ డేట్ కానున్నదని వివరించారు. అలాగే ఫారం – 6, 7, 8 లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా పరిశీలనను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాకు బ్యాలెట్ యూనిట్లు 6870, కంట్రోల్ యూనిట్లు 4270, వివిపాట్స్ 6450 రావడం జరిగిందని తెలిపారు. వీటికి సంబంధించి యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్స్ (ఏటిపి) ఆఫ్ ఈవీఎంలో భాగంగా బెల్ కంపెనీ నుంచి ఇంజనీర్లు వచ్చిన వెంటనే స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని , గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులకు ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తెలియజేయడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు రామారావు, చంద్రముని , తహసిల్దార్లు వెంకటరమణ, శిరీష , ఎన్నికల సూపరిన్ టేన్ డెంట్ సురేష్, ఇ డి టి లు జీవన్ , శైలజ , శిరీష తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News