Breaking News

జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-26 వ డివిజన్ 30 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జ‌రుగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 26 వ డివిజన్ 30 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి అన్నే రామకోటేశ్వరరావు వీధి, కాలవకట్ట, పోతినేని వారి వీధులలో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. ప్రతీ ఇంట్లో కనీసం ఒక్క సంక్షేమ పథకం ద్వారా అయినా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాల ద్వారా వైఎస్సార్ చేయూత, అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ వంటి పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన వారికి కూడా ఏడాదికి రెండు సార్లు ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

గృహ నిర్మాణంలో ఓ మైలురాయి
పేదలందరికీ సామూహిక గృహ ప్రవేశాలు రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయి అని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 71,811.49 ఎకరాలలో ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటిల్లో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా.. సెంట్రల్ నియోజకవర్గంలో 2,024 ఇళ్లను పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే రూ. 179.62 కోట్లు వెచ్చించి 428.62 ఎకరాలలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ. 409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు వివరించారు.

అమిత్ షా కుటుంబంపై దాడిని మర్చిపోయారా..?
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అరాచక పాలన సాగిందని మల్లాది విష్ణు విమర్శించారు. మే 11, 2018 న తిరుపతిలో అమిత్ షా పై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. కుటుంబ సమేతంగా వారి దర్శనానికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను వెంబడించి మరీ ఆనాడు టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని గుర్తుచేశారు. ఈ అరాచకమంతా జరిగింది చంద్రబాబు, నారా లోకేష్ డైరక్షన్లో కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఆనాడు బీజేపీ ప్రతినిధులు మాట్లాడలేదా..? మరలా ఏముఖం పెట్టుకుని అమిత్ షాను నారా లోకేష్ కలిశారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం టేక్ ఓవర్ చేసి, ఒక ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధానినే అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. దీనిపై పురంధేశ్వరి గారు ఏ సమాధానం చెబుతారన్నారు..? ఆమె ఏపీ బీజేపీ చీఫ్‌గా కాకుండా, టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పిన మాటే నిజమైందని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు తెలుగుదేశం ఖాతాకు రూ. 27 కోట్ల నిధులు మళ్లించడంపై టీడీపీ నాయకులు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 17(ఏ) వర్తించదని చెబుతున్నారు తప్ప కుంభకోణంలో బాబు పాత్ర లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల వంశీ, నాయకులు కోలా నాగాంజనేయులు, పసుపులేటి కోటేశ్వరరావు, పారా ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *